సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే… కచ్చితంగా పాటలు అదిరిపోతాయి. వీళ్ల నుంచి.. ఎప్పుడూ సూపర్ హిట్ ఆల్బమే వచ్చింది. ఎందుకో సుకుమార్ అంటే.. దేవిశ్రీ రెచ్చిపోతాడు. దాంతో పాటు ఐటెమ్ గీతం మస్టు. ఆర్య, ఆర్య2, జగడం, 100 % లవ్, రంగస్థలం… ఈ ఆల్బమ్స్ లో ఐటెమ్ గీతానికే పెద్ద పీట. ఆయా పాటలు ట్రెండ్ సృష్టించాయి. `పుష్ష`లోనూ ఓ ఐటెమ్ గీతం ఉందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దేవీశ్రీ ప్రసాద్ కూడా డిక్లేర్ చేసేశాడు. అంతేకాదు.. ఈ ఐటెమ్ గీతం కూడా రెడీ అయిపోయిందని చెప్పేశాడు. “ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉంది. అది ఎప్పుడో సిద్ధమైపోయింది కూడా. కచ్చితంగా ఓ రేంజ్‌లో ఉంటుంది“ అని అభిమానుల్ని ఊరించడం మొదలెట్టాడు దేవిశ్రీ.
నిజానికి.. పుష్ష మ్యూజిక్ సిట్టింగ్స్ లాక్ డౌన్‌లోనే మొదలైపోయాయి. అల్లు అర్జున్ తో సినిమా ఖరారు చేసుకున్నాక.. ముందు చేసిన పని.. దేవిశ్రీ దగ్గర ట్యూన్లు రాబట్టుకోవడం. అందులో భాగంగా తొలి పాటగా… ఐటెమ్ గీతమే చేసిచ్చాడట దేవిశ్రీ ప్రసాద్. త్వరలోనే.. ఈ పాటని హైదరాబాద్ లో చిత్రీకరించబోతున్నారని సమాచారం. మరి ఈసారి.. దేవిశ్రీ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.