2019 ఎన్నికలకు ముందు తెలంగాణ పోలీసులతో కలిసి వైసీపీ నేతలు ఐటీ గ్రిడ్ అనే కేసును నడిపించారు. టీడీపీ పార్టీకి చెందిన యాప్ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్ అనే సంస్థ డేటా చౌర్యం అంటూ కేసు పెట్టించి… హడావుడి చేశారు. చివరికి ఆధార్ డేటా లీక్ కావడం కానీ.. ఓటర్ల జాబితాను మార్పు చేయడం కానీ తేలింది. కానీ ఆ పేరుతో ఐటీ గ్రిడ్ కంపెనీని మూత పెట్టించారు. ప్రజల్లో అనేక రకాల అనుమానాలు ప్రచారం చేశారు. ఈ కేసులో ప్రధానంగా తెరపైకి వచ్చిన వ్యక్తి తుమ్మల లోకేశ్వర్ రెడ్డి. ఆయనే మొదటగా ఫిర్యాదుచేశారు. హైదరాబాద్ ఓటర్ అయిన ఆయన జగన్మోహన్ రెడ్డికి బంధువు. ఈ కారణంగా ఆయనకు అప్పట్లో హైప్ వచ్చింది.
ఇప్పుడు ఆయన కడప జిల్లా వైసీపీలో అలజడి రేపుతున్నారు. తాను ఎంతో చేసినా… తన బంధువుకు సొంత గ్రామంలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయలేదని ఆయన అలిగారు. తన సేవలకు గుర్తుగా పార్టీ ఇచ్చిన ఐటీ సలహాదారు పదవికి కూడా ఆయన రాజీనామా చేసేశారు. తుమ్మల లోకేశ్వర్ రెడ్డి స్వగ్రామం కమలాపురం నియోజకవర్గంలో ఉంటుంది. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. అక్కడ ఉన్న స్వగ్రామంలో పెత్తనం చేయాలని లోకేశ్వర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. మహిళలకు రిజర్వ్ కావడంతో గ్రామంలోనే ఉండే తన అన్న భార్యను నామినేషన్ వేయించారు. మొదట ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు నామినేషన్ వేయించారు. అయితే అప్పుడు ఎమ్మెల్యే కల్పించుకుని సర్పంచ్ పదవి ఇస్తామని చెప్పి నామినేషన్ విత్ డ్రా చేయించారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చే సరికి రవీంధ్రనాథ్ ప్లేట్ ఫిరాయించి తన అభ్యర్థిని నిలబెట్టాడు.
రవీంద్రనాథ్ రెడ్డి మోసం చేయడంతో లోకేశ్వర్ రెడ్డి ఫీలయ్యారు. అందుకే జగన్ ఇచ్చిన సలహాదారు పదవికి రాజీనామా పంపించారు. ఐటీ గ్రిడ్ పేరుతో తప్పుడు కేసులు పెట్టి.. ఎన్నికల సమయంలో వైసీపీకి ఎంతో సహకరించిన లోకేశ్వర్ రెడ్డికి కనీసం ఎంపీటీసీ.. సర్పంచ్ పదవి కూడా ఇవ్వడం లేదా అన్న చర్చ వైసీపీలో ప్రారంభమయింది. ఈ వివాదాన్ని జగన్మోహన్ రెడ్డి సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు. అందరూ బంధువులే కావడంతో ఎలా సర్దిచెప్పాలో.. ఎవరు సర్దిచెప్పాలో తెలియక ఇతర నేతలు కల్పించుకోవడం లేదు.