పదిహేను కోట్లు పెట్టి సినిమా తీస్తే ఒక్క రూపాయి కూడా రాకపోతే దాన్ని అట్టర్ ఫ్లాపుల్లో మొదటి రకం అంటారు. అలాగే ప్రభుత్వం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. ఇంకా చెడ్డపేరు వచ్చినా అలాగే పిలుస్తారు. ప్రస్తుతం ఇంటింటికి రేషన్ బియ్యం పథకం ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఇలాగే అయింది. ఇందులో అటు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నించిన డ్రైవర్లనూ మెప్పించలేదు. ఇటు ఇంటింటికి తెచ్చి ఇస్తారని ఆశపడ్డ ప్రజలనూ ఆకర్షించలేదు. మధ్యలో తమకు పని లేకుండా చేశారని రేషన్ డీలర్లు ఫైరయ్యే పరిస్థితి. అంతిమంగా ఈ పథకంలో ప్రభుత్వానికి చెడ్డపేరే మిగులుతోంది.
పేదలకు కొత్త కష్టం తెచ్చిన ఇంటింటికి రేషన్..!
ఇంటింటికి రేషన్ బియ్యం పథకం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే మూలనపడే పరిస్థితి వచ్చింది. వాహనదారులు రెండురోజులకే తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో అధికారులు హైరానా పడుతున్నారు. మధ్యలో రేషన్ బియ్యం మీద ఆధారపడే నిరుపేదలు నలిగిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పచ్చ జెండా ఊపడంతో విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి సైరన్ మోగించుకుంటూ ఊళ్లకు చేరుకున్న ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలు ఎక్కడివక్కడ ఉండిపోతున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా పట్టణాలు, నగరాల్లో మాత్రమే ఈ పథకం ప్రారంభమయింది. కానీ తొలి రోజు నుంచే పథకంలో లోపాలు బయటపడటం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం వందల కోట్ల రూపాయల మేర వెచ్చించి వాహనాలను కొనుగోలు చేసి వాటిని ఎమ్మెల్యేలు సూచించిన వారికి ఇచ్చింది. స్వయం ఉపాధితోపాటు కొద్దిరోజుల తర్వాత వాహనం కూడా వారి సొంతమై తద్వారా వారికి పూర్తి ఉపాధి కల్గుతుందని ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది.
రెండు రోజులకే చేతులెత్తేస్తున్న డ్రైవర్లు..!
మొత్తం 9 వేల 230 వాహనాలు కొనుగోలు చేశారు. ఒక్కో రేషన్ వాహనం నెలకు 1800 మంది కార్డు దారులకు ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేయాలి. రోజుకు వంద కార్డుల లెక్కన పద్దెనిమిది రోజుల లెక్కను ప్రభుత్వం చెప్పింది. అయితే.. ప్రాక్టికల్‌గా ప్రారంభించిన తర్వాతే వాహనదారులకు అసలు సమస్యలు తెలిసి వచ్చాయి. రేషన్ షాపు వద్ద ఉదయం దాదాపుగా 30 బస్తాలను తానే మోసుకుని వాహనంలోకి చేర్చుకోవాలి. తర్వాత వంద ఇళ్లకు ఇంటింటికి తీసుకెళ్లి పంపిణీ చేయాలి. లబ్ధిదారుడితో వేలిముద్ర కూడా ఈ-పాస్ విధానంలో నమోదు చేసుకోవాలి. ఉపాధి దొరుకుతుందని 60వేలు కట్టి వాహనం తీసుకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. 1800 మందికి రేషన్ పంపిణీ చేయాలంటే నెలంతా పడుతుంది. నెల పాటు అన్ని రకాలుగా కష్టపడితే ప్రభుత్వం పదహారు వేలు మాత్రమే ఇస్తుంది. ఇందులో పెట్రోల్ ఖర్చులు కూడా ఉన్నాయి. రెండు రోజులకే సమస్యలేమిటో తెలియడంతో… శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అనేక చోట్ల నగరాల్లో వాహనదారులు రేషన్ పంపిణీ నిలిపివేశారు. తమ వల్ల కాదని అధికారులకు చెబుతున్నారు. ఒక్కొక్కరికి రేషన్ ఇవ్వడానికి పది నిమిషాలు సమయం పడుతుందని.. రోజుకు వంద మందికి ఇవ్వడం ఎలా సాధ్యమని వాహనదారులు అనుభవంలోకి వచ్చిన తర్వాత చెబుతున్నారు.
మొత్తం వాహనాలన్నీ నిరుపయోగమేనా..!?
రాష్ట్రంలో మొత్తం 9 వేల 230 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయగా, ఇందులో ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల నగరాలు, పట్టణ ప్రాంతాలకు కేటాయించిన 2 వేల 230 వాహనాలను మాత్రమే వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 7 వేల వాహనాలు ఎన్నికల కోడ్ కారణంగా బయటికి తీయలేదు. ఇక ఆ వాహనాలను కూడా బయటికి తీస్తే ఇంటింటికీ రేషన్ కార్యక్రమం లో అసలు పదనిసలు బయటకు వస్తాయి. రేషన్ తీసుకునేవారు కూడా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అలా ఉంచేస్తే.. ఎప్పుడు కుదిరితే అప్పుడు రేషన్ దుకాణంకు వెళ్లి తీసుకుంటాం గా.. ఈ తిప్పలెందుకని అంటున్నారు. మొత్తంగా ప్రభుత్వం సింపుల్‌గా పోయేదాన్నిచింపి చేట చేసుకుంది. ఇది ఎక్కడకు దారి తీస్తుందో…?