కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి తనతో కలిసి వచ్చే నాయకులతో రాజకీయం చేస్తున్నారు. రైతు దీక్షలు చేస్తున్నారు. ఇలా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోనూ ఓ రైతు దీక్ష సభ ఏర్పాటు చేశారు. ఆ సభకు హాజరైన రేవంత్ రెడ్డి… అక్కడికక్కడే పాదదయాత్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క.. రేవంత్ రెడ్డిని పాదయాత్ర చేయాలని కోరింది. వెంటనే రేవంత్ అంగీకరించి.. అప్పటికప్పుడు ప్రారంభించారు. తొలి రోజు సాయంత్రం పాదయాత్ర ప్రారంభించినా ఎనిమిది కిలోమీటర్ల వరకూ నడిచారు. రోడ్డు పక్కన ఓ టెంట్ వేసుకుని కింద పడుకుని నిద్రపోయారు. ఈ పాదయాత్ర హైదరాబాద్ వరకూ సాగనుంది. రోజుకు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల పాటు సాగి.. హైదరాబాద్ శివార్లలో సరూర్ నగర్లో భారీ బహిరంగసభ నిర్వహించి ముగించనున్నారు.
రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయంతో కాంగ్రె్స్ శ్రేణులు అవాక్కయినా ఉత్సాహంగా ఆయన వెంట నడిచాయి. ఆయన వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు. ముందస్తుగాఎలాంటి ఏర్పాట్లు లేకుండా పాదయాత్ర చేయడం కష్టమే., అయినా రేవంత్ చాలెంజ్‌గా తీసుకున్నారు. రేవంత్ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో మాస్ లీడర్. పై స్థాయిలో ఆయనపై వ్యతిరేకత ఉన్నా.. పీసీసీ అధ్యక్షుడు కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా.. ద్వితీయ శ్రేణి నేతల్లో.. క్యాడర్లో ఆయనకు పలుకుబడి ఉంది. కాంగ్రెస్‌కు ఆయన నాయకత్వమే కావాలన్న అభిప్రాయం ఉంది. అందుకే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పేరును ఖరారు చేసినా.. హైకమాండ్ ప్రకటించలేకపోతోంది. ఇతర నేతలు ఎక్కడ తిరుగుబాటు చేసి పక్ పక్క పార్టీలోకి వెళ్లిపోతారేమోనని ఆందోళన చెందుతోంది. ఈ కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తోంది. కొద్ది రోజుల కిందట ఇక ప్రకటనే ఆలస్యం అనిచెప్పుకున్నారు కానీ… ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నిక తర్వాత అని మాట మార్చారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తన కార్యాచరణ ఆపలేదు. కొనసాగిస్తున్నారు. తన రాజకీయం తాను చేయకపోతే.. మొత్తానికే నిర్వీర్యమైపోతామన్న ఆందోళనతో ఆయన రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
అయితే ఆయన పాదయాత్రపైనా… హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లడం ఖాయం. కాంగ్రెస్‌లో ఏంచేయాలని హైకమాండ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే.. ఊరుకోరు. ఇతర నేతలు కంప్లైంట్లకు రెడీగా ఉంటారు. ఇప్పుడు.. అదే జరిగే అవకాశం ఉంది. మాణిగం ఠాకూర్ దీనిపై ఎలాస్పందిస్తారన్నదానిపై రేవంత్ పాదయాత్రకు హైకమాండ్ ఆశీస్సులు ఉన్నాయా లేవా అన్నది తేలుతుంది. ఒక వేళ పార్టీ హైకమాండ్ పాజిటివ్గాస్పందిస్తే.. ఆయనకు తిరుగులేదని చెప్పుకోవచ్చు.