తెలంగాణ బీజేపీ నేతలు కర సేవ.. కర్ర సేవ రాజకీయానికి అలవాటు పడ్డారు. ఎక్కడికి వెళ్లినా దాడులు చేయడమే వ్యూహంగా పెట్టుకున్నారు. ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు చేశారు. తాజాగా బండి సంజయ్… సూర్యాపేట జిల్లాలో భూముల పరిశీలనకు వెళ్తే.. అక్కడా కార్యకర్తలు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆస్తుల ధ్వంసమే కాదు… పోలీసులకు కూడా గాయలయ్యాయి. హుజూర్ నగర్ నియోజవర్గంలో కొంత మంది గిరిజనుల భూముల్ని కబ్జా పెట్టారు. ఆ విషయం బయటకు వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అసెంబ్లీలో ఈ విషయాన్నిచెప్పారు. విచారణ జరుగుతోంది. అయితే ఆ భూముల్లో ఓ సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ పెట్టాలని అనుకుంది నిర్మాణాలు ప్రారంభించింది.
అయితే ఆ భూములన్నీ గిరిజనులవని.. గిరిజన భరోసా యాత్రను ఆదివారం బీజేపీ నేతలు ఏర్పాటు చేసుకున్నారు. అందరూ బస్సులో గుర్రంపోడు గ్రామానికి వెళ్లారు. సభ ఏర్పాటు చేశారు. అయితే.. బండి సంజయ్ వస్తున్న సమయంలోనే… బీజేపీ కార్యకర్తలు… సభకు కిలోమీటర్ దూరంలో ఆ భూముల్లో ఏర్పాటు చేసిన షెడ్లపై పడ్డారు. కూల్చేందుకు ప్రయత్నించారు. కానీ… బీజేపీ కార్యకర్తలు… షెడ్లతో పాటు పోలీసుల్ని కూడా కూల్చేందుకు వెనుకాడలేదు. డీఎస్పీ, సీఐల్లాంటి అధికారులకే రాళ్ల దెబ్బలు తగిలాయి. రక్తం కారుతూంటే వారు ఆస్పత్రికి పరుగులు పెట్టాల్సి వచ్చింది.ఈ ఉద్రిక్తత తర్వాత బండి సంజయ్ బహిరంగసభలో మాట్లాడారు. కరసేవ ప్రారంభమైందన్నట్లుగా .. టీఆర్ఎస్తో యుద్ధం ప్రారంభమైందన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు.
పోరాటం టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉందని చెప్పుకోడానికి ఇలా దాడులు చేయడమే మార్గమని బీజేపీ వ్యూహకర్తలు నిర్ణయానికి వచ్చినట్లుగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల నుంచి బీజేపీ అదే వ్యూహం పాటిస్తోంది. తామే ప్రధాన పోటీ దారు అని చెప్పుకోవాలంటే.. వివాదాస్పద విషయాల్లో హైలెట్ అవ్వాలని అనుకుంటోంది. హైదరాబాద్ లాంటిచోట్ల మాటలకు పబ్లిసిటీ వస్తుంది కానీ.. ఇతర చోట్ల దాడులే ఆ పనిచేస్తాయని నమ్మకం వచ్చినట్లుగా ఉంది. ఏ కార్యక్రమం పెట్టుకున్నా అదే పని చేస్తున్నారు. బీజేపీ విషయంలో టీఆర్ఎస్ దూకుడుగా వెళ్లకపోవడం వారికి మరింత అడ్వాంటేజ్‌గా మారుతోంది.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక త్వరలో జరగనుంది. పొరుగునే ఉన్న సాగర్ ఉపఎన్నికలో తామే ప్రధాన ప్రత్యర్థిగా ఉండాలన్న లక్ష్యంతో బీజేపీ హుజూర్ నగర్ రచ్చ చేసిటన్లుగా తెలుస్తోంది. ఈ దాడుల వ్యవహారం బీజేపీకి చెడ్డ పేరు తీసుకు వస్తుంది. అలా అర్థం పర్థం లేని ఆవేశంతో అందరిపైనా దాడులు చేసుకుంటూ వెళ్తే… ప్రజల్లో బ్యాడ్ ఇమేజ్ వస్తుంది. ఆస్తుల విధ్వంసం అనేది రాజకీయ పార్టీ అసలు చేయకూడదు. కానీ టీఆర్ఎస్తో పోటీ పడుతోంది తామే అని చెప్పుకోవాలంటే తప్పదన్నట్లుగా దాడులకు పాల్పుడుతోంది.