ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై రాజ్యసభలోనే విజయసాయిరెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. మీ తనువు బీజేపీలో ఉంది. మనసు టీడీపీలో ఉంటుంది.. టీడీపీతోనే నడుస్తుందని విమర్శించారు. విజయసాయి మాటలతో తోటి సభ్యులు కూడా అవాక్కయ్యారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఏ పార్టీలోనూ ఉండరు. ఆయనకు రాజకీయాలతో సంబంధం ఉండదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత బీజేపీకి వెంకయ్యనాయుడు రాజీనామా చేశారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు.
అనుచితంగా ప్రవర్తించిన విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఇతర పార్టీలుక చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ .. తక్షణం చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. వెంకయ్యనాయుడు కూడా ఈ వ్యాఖ్యలపై మనస్థాపం చెందారు. తనను పని చేయనివ్వకుండా చేసేందుకు ఇలా వ్యాఖ్యానిస్తున్నారని.. కానీ తన విధులను మాత్రం తాను వదిలి పెట్టబోనన్నారు. నిష్ఫాక్షితతను ప్రశ్నించడం బాధనిపించిందన్నారు. విజయసాయిరెడ్డి వెంకయ్య నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం… రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల చేసిన ప్రసంగంలో జగన్ పై చేసిన ఆరోపణలను రికార్డుల నుంచి తొలగించకపోవడం.
తొలగించనని కూడా వెంకయ్యనాయుడు చెప్పలేదు. లిఖితపూర్వకంగా ఇస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటానన్నారు. అది కూడా విజయసాయిరెడ్డికి నచ్చలేదు. వెంకయ్యతో వాగ్వాదానికి దిగారు. సభలో మాట్లాడటానికి తనకు సమాన హక్కులు ఉన్నాయని ఆయన వాదించారు. విజయసాయిరెడ్డి తీరు పెద్దల సభలో మరోసారి కలకలానికి కారణం అయింది.