జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లారు. స్టీల్ ప్లాంట్ అంశంపై ఆయన బీజేపీ నేతలతో ఏదో ఒకటి తేల్చాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే తీరని అన్యాయం జరిగిందని ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తే.. ప్రజల సెంటిమెంట్ పూర్తిగా తెబ్బతింటుందని ఆయన భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ హైకమాండ్‌కు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. తనకు అపాయింట్ మెంట్ కావాలని జేపీ నడ్డా టీంకు పవన్ కల్యాణ్ సమాచారం అందించగానే ఆయనకు అపాయింట్ మెంట్ ఖరారయింది. దీంతో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ సహా వివిధ అంశాల్లో ఏపీకి పెద్దగా ప్రయోజనాలు కల్పించడం లేదు. అదే సమయంలో అమరావతి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వానికే మద్దతు తెలుపుతున్నట్లుగా ఉంది.
రాజకీయంగా మాత్రం అమరావతికి మద్దతు తెలుపుతోంది. ఈ క్రమంలో బీజేపీపై ప్రజల్లో అనేకానేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రభావం జనసేన పైన కూడా పడుతోంది. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్.. బీజేపీతో కలసి నడవడం కన్నా.. సొంత దారిలో వెళ్లేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో జేపీ నడ్డాతో భేటీకి పవన్ కల్యాణ్ హుటాహుటిన వెళ్లడం ఆసక్తి రేపుతోంది. తిరుపతి ఉపఎన్నిక విషయంలో ఇప్పటికీ… అక్కడ్నుంచి ఎవరు పోటీ చేయాల్ననదానిపై క్లారిటీ లేదు. ప్రతీ సారి జనసేననే త్యాగం చేయాల్సి రావడంతో జనసేన క్యాడర్లో నిరుత్సాహం ఏర్పడుతోంది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ .. స్టీల్ ప్లాంట్ పై కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో విశాఖలోని మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా అమ్మేయాలనుకున్నప్పుడు పవన్ కల్యాణ్ పోరాడారు. ఇప్పుడు అంత కంటే ఎన్నో రెట్లు పెద్దది.. తెలుగు వాళ్ల బలి దానాలతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయవద్దన్న డిమాండ్ ను జేపీ నడ్డా ముందు పవన్ ఉంచే అవకాశం ఉంది. బీజేపీ నేతలు కూడా.. అదే డిమాండ్ తో ఉన్నారు. పధ్నాలుగో తేదీన వారు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అంత కంటే ముందే పవన్ కల్యాణ్‌కు అపాయింట్ మెంట్ లభించింది.