ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంటే… దేశంలోని అందరికీ భయభక్తులు. చివరికి ఆయన ప్రత్యర్థులకు కూడా. ఆయనపై పెద్దగా నోరు పారేసుకోరు. ఆయనను ఏదో చేస్తామని అనే ప్రయత్నం కూడా చేయరు. రాజకీయంగా కూడా ఘాటుగా విమర్శించడానికి భయపడతారు. చివరికి జగన్మోహన్ రెడ్డి కూడా. అయితే ఆయన ఇప్పుడు అలా ఉండటానికి కారణాలు వేరే ఉన్నాయని సమయం రాగానే… నరేంద్రమోడీని మట్టి కరిపించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితునిగా పేరు పొందిన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్… తమ నేత వీరత్వం.. ధైర్యం… పోరాట పటిమ గురించి అనర్ఘళంగా ప్రసగించారు.
అందులోనే మోడీ ఎంత.. ? అన్నట్లుగా స్పీచ్ ఇచ్చేశారు. సందర్భం.. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణపై అఖిలపక్ష సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న అమర్నాథ్ రెడ్డి… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా జగన్ అడ్డుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం జగన్ పోరాట పటిమ అందరికీ తెలుసని .. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ను మట్టికరిపించిన.. జగన్కు మోదీ పెద్ద లెక్క కాదని ప్రకటించేశారు. ఆ సమావేశంలో ఉన్న వారందరూ అమర్నాథ్ వైపు అదో రకంగా చూశారు. అయన అదేం పట్టించుకోలేదు. తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఈ మాటలు.. ఏ బీజేపీ నేత అయినా సీరియస్ గా తీసుకుని .. పై వాళ్లకు ట్రాన్స్ లేట్ చేసి పంపిస్తే… దాన్ని వాళ్లు సీరియస్గా తీసుకుంటే సమస్య వస్తుందేమో అని వైసీపీలో కొంత మంది గుసగుసలాడేసుకుంటున్నారు. కానీ.. గతంలో చాలా సార్లు వైసీపీ నేతలు మోడీని తిట్టారు. కొడాలి నాని ఆయన భార్య గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఏమీ చేయని బీజేపీ నేతలు ఇప్పుడు మాత్రం ఎందుకు చేస్తారని అంటున్నారు. రెండు పార్టీల మధ్య అండర్ స్టాండింగ్ ఉంది కాబట్టి.. ఇవన్నీ నడిచిపోతాయంటున్నారు.