తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఈటల రాజేందర్ సొంత పార్టీ ఆలోచన చేస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. కొద్ది రోజులుగా ఆయన టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకమైన ప్రకటనలు చేస్తున్నారు. రెబల్ ఇమేజ్ కోసం అన్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ఆయనను టీఆర్ఎస్ హైకమాండ్ కూడా దూరం పెట్టిందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఈటల రాజేందర్ సొంత పార్టీ ప్రచారం తెరపైకి వచ్చింది. ఆయన మాత్రం .. మరో మాట లేకుండా ఖండిస్తున్నారు. కానీ ఇతరులు మాత్రం ఆయన పార్టీ ఖాయమని… రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తున్నారు.
కుమారుడికి పట్టం కట్టాలనుకున్న కేసీఆర్ … ముప్పుగా ఉన్న కొంత మంది సీనియర్ల ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గించుకుటూ వస్తున్నారు. ముందుగా హరీష్ రావును నిర్వీర్యం చేశారు. ఆయన నిర్వీర్యం అయ్యారా లేకపోతే వ్యూహాత్మకంగా అలా కనిపిస్తున్నారా అన్నది తర్వాత సంగతి. ఆ తర్వాత ఈటల ప్రాధాన్యం కూడా తగ్గించే ప్రయత్నం జరిగింది. కేసీఆర్ సొంత మీడియాలో ఆయనో ప్రజాదరణ లేని నేత అని.. బీసీ కాబట్టే మంత్రివర్గంలో ఉన్నారని ప్రచారం చేశారు. అప్పుడే ఆయన భగ్గుమన్నారు. ఆ తర్వాత ఆయనపై వ్యతిరేక వార్తలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ఈటల జోరందుకున్నారు. కేసీఆర్ పంటల కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తామని చెప్పారు. కానీ ఈటల మాత్రం… దూకుడుగా వెళ్తున్నారు. ప్రతి గింజ కొనాల్సిందే అంటున్నారు.
ఈ నేపధ్యంలో పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ చాలా మాటలు మాట్లాడారు. అందులో ఇతరులు పెట్టాలనుకున్న పార్టీలపైనా స్పందించారు. బీసీ నేతలు పార్టీలు పెడితే రాణించలేదన్న అభిప్రాయాన్ని చెప్పారు. బహుశా..ఈటల పార్టీ పెడతారనే పక్కా సమాచారం ఉండటం వల్లనే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ నడుస్తోంది. బీసీ నినాదంతో ఈటల తెలంగాణ సమాజంలోకి వెళ్తే… కీలకమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. బీసీలంతా ఏకమైతే కొత్త రాజకీయ శక్తిగా అవతరించవచ్చు. ఈటలకు ఉద్యమ సమయం నుంచి ఎంతో కొంత పలుకుబడి ఉంది. ఆయనపై సానుభూతి కూడా ఉంది. కేటీఆర్‌ను సీఎం చేస్తారన్న ప్రచారం నేపధ్యంలో ఇతర పార్టీల నుంచి ఈటలకు సానుభూతి వచ్చింది. దీంతో కేసీఆర్ వెనక్కి తగ్గారని చెబుతున్నారు.
కొద్ది రోజుల కిందట… కేటీఆర్‌ను సీఎం చేస్తే.. టీఆర్ఎస్ నేతలు కొత్త పార్టీలు పెట్టుకుంటారని… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. అవి ఉత్తుత్తి మాటలు కాదని.. నిజంగానే ఆ తరహా … పరిస్థితులు ఉన్నాయని తాజా పరిణామాలతో నిరూపితమవుతోంది. ప్రస్తుతం ఈటలకు అలాంటి ఆలోచన ఉన్నా లేకపోయినా.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో.. ఆయనపై టీఆర్ఎస్లో అపనమ్మకం పెరుగుతుంది. అప్పుడు సొంత పార్టీ పెట్టుకోక తప్పని పరిస్థితి ఏర్పడే రాజకీయం జరిగే చాన్స్ కనిపిస్తోంది.