ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల బకాయిల విషయంలోనూ ఏపీ సర్కార్ కోర్టుల చుట్టూ తిరిగి లాయర్లకు డబ్బు చెల్లించడానికి ప్రయత్నిస్తోందికానీ… వారికి ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వడం లేదు. పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడిన ఏపీ ప్రభుత్వం చివరికి వడ్డీ డిస్కౌంట్ మాత్రం తెచ్చుకుంది. పన్నెండు శాతానికి బదులు ఆరు శాతం వడ్డీతో ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.అదీ కూడా తమ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో ఉందని కట్టలేమని ప్రభుత్వం తరపు న్యాయవాది బతిమాలడంతోనే ఈ కాస్త రిలీఫ్ కూడా ఇచ్చారు. లేకపోతే హైకోర్టు చెప్పినట్లుగా 12 శాతం జీతంతో చెల్లించాల్సి వచ్చేది.
లాక్డౌన్ పేరుతో రెండు నెలల పాటు ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం జీతం కోత వేసింది. ఇప్పటికే ఏడాది అవుతోంది. కానీ చెల్లించలేదు. మధ్యలో ఓ మాజీ ఉద్యోగి కోర్టుకు వెళ్లడంతో 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే వడ్డీతో చెల్లించడం నామోషీ అనుకున్న ప్రభుత్వం.. . వాటిని కొట్టి వేయాలని.. సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గతంలో వడ్డీ లేకుండా చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. కానీ.. రెండు నెలలు మాత్రమే గడవు ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇలా ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఐదారు వాయిదాల్లో ఇవ్వాలని అనుకుంటోంది. దీంతో మళ్లీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రెండు నెలల పాటు ఉద్యోగులు పెన్షనర్ల వద్ద కత్తిరించిన దాదారు రూ. ఆరు వేల కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మొత్తానికి ఆరు శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే పొందగలిగినంత రుణం పొందిన ఏపీ సర్కార్ ఓవర్ డ్రాఫ్ట్ల మీద బండి నడిపిస్తోంది. నెలాఖరుకు వచ్చే సరికి.. జీతాల కోసం ఎక్కడైనా అప్పులు దొరుకుతాయేమోనని.. ఎదురు చూస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు… ప్రభుత్వానికే బాకా ఊదుతున్నారు. అయితే సుప్రీంకోర్టు ఇంత కాలంలో చెల్లించాలని చెప్పలేదన్న కారణం చూపి.. ప్రభుత్వం ఆలస్యం చేసే అవకాశం కూడా ఉందంటున్నారు.