ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వాదన … ” మరీ ఇలాంటి వాళ్లను గెలిపించామా” అని ప్రజలు అనుకునే స్థితికి వెళ్లిపోతోంది. స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. పదవులకు రాజీనామా చేయాలనే ఒత్తిడి వస్తోంది. అయితే వైసీపీ నేతలు మాత్రం విచిత్రమైన వాదన తెరపైకి తీసుకు వస్తున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి.. తాము ప్రజలు గెలిస్తే.. పదవుల్లో ఉన్నామన్న సంగతి మర్చిపోయారు. బాధ్యత తీసుకోవాల్సిన వారు… పవన్ కల్యాణ్ మీద పడుతున్నారు. గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్‌కు బాధ్యత లేదా అని ఎమ్మెల్యే నాగిరెడ్డి ప్రశ్నించేస్తున్నారు.
నిజంగా ఆయన ప్రశ్నను చూసి పక్కన ఉన్న వాళ్లు కూడా.. ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. పవన్ కల్యాణ్ పోటీ మాత్రమే చేశాడు.. పోటీ చేసి ఆయన మీద గెలిచిన నాగిరెడ్డికి ఇంకెంత బాధ్యత ఉండాలి..? అంతగా ఆయన పోరాడలేకపోతే.. రాజీనామా చేసి.. పవన్ కల్యాణ్‌ను గెలిచి పోరాడమని సలహా ఇవ్వాలన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పోటీ పడి మరీ పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మోడీ వద్దకు వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ … మోడీ వద్దకు వెళ్లి స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడితే.. ఏపీలో తిరుగులేని అధికారం అనుభవిస్తూ… పవన్ కల్యాణ్‌పై ఎప్పుడు కావాలంటే అప్పుడు అసభ్యంగా మాట్లాడే వైసీపీ నేతలు కాళ్లు చాపుకుని కూర్చుంటారా..? అన్న విమర్శలు జనసేన నేతల నుంచి వస్తున్నాయి.
పవన్ కల్యాణ్… తన బాధ్యతగా .. తనకు ఉన్న శక్తి మేర తాను పోరాడుతున్నారు. ఆయన ఢిల్లీ పెద్దలతో మాట్లాడటానికి వెళ్లారు. కానీ వైసీపీ నేతలు.. డొంక తిరుగుడు వ్యవహారాలతో మొత్తానికే ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తూ… రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ పోరాడుతున్నారు కాబట్టి… వైసీపీ నేతలు రాజీనామా చేసి ఆయన వెనుక నడవాలని డిమాండ్ చేస్తున్నారు.