ఆస్ట్రేలియాని.. అందునా ఆ దేశంలో ఓడించి – నివ్వెర పరిచిన టీం ఇండియా – స్వదేశంలో ఇంగ్లండ్ పై చేతులెత్తేసింది. చెన్నైలోని తొలి టెస్టులో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్… ఇంగ్లిష్ జట్టు చేతిలో.. 227 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. చివరి రోజు.. వికెట్లు కాపాడుకోలేక తలవొంచింది. ఫలితంగా తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. టెస్టు మ్యాచ్ గెలవాలంటే చివరి రోజు 381 పరుగులు చేయాలి. ఓటమి తప్పించుకోవాలంటే చేతిలో ఉన్న 9 వికెట్లతో చివరి బంతి వరకూ పోరాడాలి. కానీ.. ఇవి రెండూ చేయలేకపోయింది భారత్. ఒక వికెట్ నష్టానికి 39 పరుగులతో.. ఐదో రోజు పోరాటం ప్రారంభించిన భారత్కు.. ఆండర్సన్, జాక్ లీచ్ కోలుకోలేని దెబ్బకొట్టారు. తొలుత పుజారా (15)ని లీక్ అవుట్ చేశాడు. అక్కడి నుంచి వికెట్ల పతనం ప్రారంభమైంది. గిల్ (50) ఆండర్సన్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అదే ఓవర్లో రెహానే (0) కూడా వెనుదిరిగాడు. అద్భుతమైన ఫామ్ లో ఉన్న పంత్ (11) ఈసారి.. వికెట్లని కాచుకోలేకపోయాడు. ఓ దశలో లంచ్కి ముందే భారత్ ఆలౌట్ అవుతుందనిపించింది. అయితే.. కోహ్లి (72), అశ్విన్ (9) వికెట్ల పతనాన్ని కాసేపు అడ్డుకున్నారు. వీళ్లు కూడా.. త్వరత్వరగా అవుటై పెవిలీయన్ చేరడంతో భారత్ ఓటమి తప్పలేదు. చివరికి 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జాక్ కి 4, ఆండర్సన్కి 3 వికెట్లు దక్కాయి.