వైయస్సార్ కుమార్తె షర్మిల ఈరోజు లోటస్ పాండ్ వేదికగా, తెలంగాణ లోని తన సన్నిహితులతో పార్టీ అభిమానులతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోపక్క సాక్షి పత్రిక షర్మిల వార్తను కనీసంగా కూడా కవర్ చేయకపోవడంతో జగన్ కి షర్మిల కు మధ్య విభేదాలు తేటతెల్లం అవుతున్నాయి. అయితే అందరి మదిలో ఉన్న ప్రశ్న ఒక్కటే. ఇప్పుడు ఇంత హఠాత్తుగా షర్మిల పార్టీ పెట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? అది కూడా తెలంగాణలో పార్టీ ఎందుకు పెడుతున్నారు. పాత్రికేయులు కూడా షర్మిలను ఇవే ప్రశ్నలు సంధించగా ఆమె వాటిపై స్పందించారు.
పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల స్పందన:
అయితే పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిల నేరుగా స్పందించకుండా తాను పార్టీ ఎందుకు పెట్టకూడదు అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో పార్టీ పెట్టే ఉద్దేశ్యం ఆమెకు ఉందన్న విషయం పాత్రికేయులకు స్పష్టమైంది. అంతేకాకుండా తనను మాట్లాడమని అడిగినప్పుడు, ఆమె ఈ రోజు తాను మాట్లాడడానికి రాలేదని అభిమానులు సన్నిహితులు చెప్పేది వినడానికి వచ్చానని అన్నారు. అయితే వైయస్సార్ లేని లోటు తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోందని, రాజన్న రాజ్యం లో రైతు రాజులా ఉండేవాడని, తెలంగాణలో తాను రాజన్న స్వర్ణయుగాన్ని తెస్తా అని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు ఆమె పార్టీ పెట్టే ఉద్దేశాలను స్పష్టం చేశాయి.
షర్మిలకు లోక్ సభ రాజ్యసభ సీటు విషయంలో జగన్ మాట తప్పిన విషయం నిజమే: గోనె ప్రకాశరావు
అయితే ఇంత హఠాత్తుగా ఆమె పార్టీ పెట్టడానికి కారణాలు ఏమిటి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో ఉంది. నిన్నటి నుండి అనేక టీవీ ఛానల్స్ లో వైయస్సార్ మరియు షర్మిలకు సన్నిహితుడిగా ఉన్నటువంటి గోనె ప్రకాశ్ రావు ఈ అంశంపై పలు ఆసక్తికర విషయాలను చెబుతూ వస్తున్నారు. జగన్ 2019 ఎన్నికలలో షర్మిలకు వైజాగ్ లోక్ సభ సీటు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, 2020లో రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పి ఆవిడను అప్పట్లో సముదాయించారు అని, అయితే 2020 రాజ్యసభ ఎన్నికల సమయంలో కూడా షర్మిలకు జగన్ సీటు ఇవ్వలేదని, ఆ విషయమై షర్మిలకు కొంత బాధ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆమె తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తున్న కారణంగా ఇది అన్న జగన్ కు పోటీ పార్టీ అని అనుకోవడానికి వీలు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వైయస్సార్ కుటుంబంలో విభేదాలు ఉండకూడదని వారంతా కలిసి ఉండాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన చెప్పుకొచ్చారు. కానీ జగన్ భార్య భారతికి , షర్మిలకు మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమే అనీ ఆయన కుండ బద్దలు కొట్టారు. ఇంతేకాకుండా షర్మిల భర్త బ్రదర్ అనిల్ కు- కుటుంబంలోను, పార్టీలోను కూడా కొంత అవమానం జరిగింది అన్న వార్తలు ఉన్నాయని ఆయన టీవీ ఛానల్ లో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
షర్మిల భారతి ల మధ్య విభేదాలకి ప్రధాన కారణం :
మరోవైపు రాజకీయవర్గాల్లో- షర్మిల కు సొంత రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని, జగన్ తో పోలిస్తే ఆయన కంటే తాను ఎక్కువ దూరం పాదయాత్ర చేశానని, ఆయన కంటే ఎక్కువగా పార్టీ కోసం తాను కష్టపడ్డాను అన్న భావన షర్మిల లో ఉందని, వీటికి తోడు వైయస్సార్ సిపి పార్టీ తరఫున తాను కష్టానికి తగిన ప్రతిఫలం లభించలేదని, వైయస్ భారతి కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందనే భావన షర్మిల లో కూడా ఉందని అందువల్లే ఈ ఆత్మీయ సమావేశాలు మొదలు పెట్టారు అనే చర్చ బలంగా వినిపిస్తోంది. సాక్షి లో షర్మిల గురించి కవరేజ్ పూర్తి గా తగ్గడానికి భారతి ఆజ్ఞ లే కారణం అని మీడియా వర్గాల్లో ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే భారతి షర్మిలల మధ్య వివాదానికి ప్రధాన కారణం విషయంలో కూడా కొన్ని ఆసక్తికరమైన గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు అని, జగన్ మీద ఉన్న కేసుల దృష్ట్యా ఒకవేళ ఏదైనా అనూహ్య పరిస్థితులు ఏర్పడి జగన్ జైలుకు వెళ్ళాల్సి వస్తే, షర్మిల ఇప్పటినుండే పవర్ సెంటర్ గా మారితే, అప్పుడు ముఖ్యమంత్రి పదవికి తాను ప్రధాన పోటీదారు అవుతుందని, అలా జరగడం భారతి కి ఇష్టం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ముఖ్యమంత్రి పదవి భారతి చేపట్టేలా పార్టీలో ఇప్పటికే వ్యూహ రచన జరిగిందని ఆ మధ్య రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.
ఆస్తి వివాదాలు కూడా కారణమా?
మరొక వైపు ఆస్తి పంపకాల విషయంలో కూడా జగన్ మరియు షర్మిల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి అనే వాదన వినిపిస్తోంది. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆస్తుల విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య ఏర్పడిన విభేదాలు ప్రస్తుతం తారా స్థాయికి చేరాయని, ఒకవైపు పార్టీలో రాజకీయ ప్రాధాన్యం ఇవ్వకపోవడం, లోక్ సభ , రాజ్యసభ విషయంలో ఇచ్చిన మాట జగన్ తప్పడం, వీటితో పాటు ఆస్తుల విషయంలో కూడా తనకు అన్యాయం జరుగుతూ ఉండడం షర్మిల తాజా ప్రయత్నాలకు ప్రధాన కారణం అని వాదన వినిపిస్తోంది. మరి కొద్ది వారాల పాటు జరిగే ఈ ఆత్మీయ సమ్మేళనాల సమయంలోనే జగన్ భారతి లు తమ తరఫునుండి సమస్య పరిష్కారానికి చొరవ చూపితే పార్టీ పెట్టే ఆలోచన షర్మిల విరమించుకునే అవకాశం ఉందని, ఒకవేళ అప్పటికీ వారు మొండిగా వ్యవహరిస్తే అదే మొండి తనం తనలో కూడా ఉందని నిరూపించేలా షర్మిల కార్యాచరణ ఉండవచ్చని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కానీ తెలంగాణలో పార్టీ పెట్టడం ద్వారా జగన్ ని ఇరుకున పెట్టే అవకాశం పెద్దగా లేదన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో పార్టీ అంటూ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని ఆంధ్ర ప్రదేశ్ విస్తరించే అవకాశం కూడా ఉంటుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. షర్మిల ప్రస్తుతం జరుపుతున్న ఆత్మీయ సమ్మేళనాలు కేవలం తన డిమాండ్లను అన్న వద్ద సాధించుకునే లా జరుపుతున్న వ్యూహం మాత్రమే అని మరి కొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి
కానీ, షర్మిల చేయబోతున్న రాజకీయం ఎలా ఉండనుంది అన్న ఆసక్తి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.