ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ కోర్టులు కొట్టి వేస్తూండటంతో.. పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఏం చేయాలా అని తీవ్రంగా మేధోమథనం జరిపి.. చివరికి ప్రతీ ఒక్క నిర్ణయాన్ని… అడ్వకేట్ జనరల్ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. ఇకపై విధాన నిర్ణయాలు, పథకాల ముసాయిదాకు ఏజీ అనుమతి తప్పనిసరి చేస్తూ… నేరుగా జీవో జారీ చేసేశారు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్. నిజానికి ఎలాంటి జీవో అయినా సీఎస్ నిర్ణయం ఫైనల్ అవుతుంది. కానీ ఇక్కడ… ఏజీ చేతుల్లోకి నిర్ణయం వెళ్తోంది. ఉత్తర్వులు, ముసాయిదా పత్రాల జారీకి ముందు ఏజీకి పంపాలని.. అన్ని విభాగాలూ మార్గదర్శకాలు పాటించాలని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది.
దీనికి కారణంగా కోర్టుల్లో ప్రభుత్వ నిర్ణయాలపై వస్తున్న వ్యతిరేక తీర్పును చూపించారు. సాంకేతిక సమస్యల వల్ల న్యాయ సమీక్షకు వెళ్తున్నాయని .. కోర్టుల్లో సమస్యలు రాకూడదనే ఏజీ అనుమతి తప్పనిసరి చేస్తూ జీవో జారీ చేస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎవరైనా ఈ జీవోపై కోర్టుకు వెళ్తే… దీనికే సమస్యలు వస్తాయన్న సెటైర్లు ఉద్యోగవర్గాల్లో పడుతున్నాయి. నిర్ణయాలపై న్యాయ సలహా తీసుకోవడం వరకు ఓకే కానీ.. ప్రతీ విధానపరమైన నిర్ణయం… పథకాల ముసాయిదా.. ఏజీ అనుమతి తీసుకోవాలని జీవో జారీ చేయడం చెల్లదన్న అభిప్రాయం కూడా ఉంది.
నిజానికి కోర్టుల్లో సమస్యలు రాకుండా ఉండాలంటే.. చట్ట బద్ధంగా జీవోలు జారీ చేస్తే చాలని.. ఇప్పటి వరకూ పని చేసిన ప్రభుత్వాలు అదే చేశాయని కొంత మంది గుర్తు చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలనే కోర్టులు కొట్టి వేస్తున్నాయంటున్నారు. ఎలాగైతేనేం ఇప్పుడు.. ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలన్నీ ఏజీ ఓకే అంటేనే ఆ తర్వాత అమల్లోకి వస్తాయి. ఆయన ఆపేస్తే ఆగిపోతాయి.