షర్మిల పార్టీ ఏపీలోనూ చర్చనీయాంశమయింది. వైఎస్ జగన్‌కు చెందిన మీడియా… అసలు ఎలాంటి కవరేజీ షర్మిలకు ఇవ్వలేదు. షర్మిల ఫోటో చూపించడానికి కూడా జగన్ సొంత మీడియా ఇష్టపడలేదు. అయితే జగన్‌కు మద్దతుగా నిలిచే ఓ వర్గం మీడియా మొత్తం షర్మిలకు పూర్తి స్థాయిలో కవరేజీ ఇచ్చింది. ఈ పరిణామం ఏమిటో వైసీపీ నేతలకూ అర్థం కాలేదు. అయితే.. జగన్ సొంత చెల్లికి న్యాయం చేయలేదని.. అందుకే ఆమె వెళ్లి పార్టీ పెట్టుకుందన్న భావన ప్రజల్లోకి వెళ్తోందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక రకాల నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం వల్ల చెప్పిందేదీ చేయరన్న ప్రచారం జరుగుతోందని ఇలాంటి సమయంలో… షర్మిల కూడా వేరే పార్టీ పెట్టుకోవడం ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
పార్టీ కార్యకర్తల్లో గందరగోళాన్ని తెర దించడానికి సజ్జల రామకృష్ణారెడ్డి తప్పనిసరి అయి… మీడియా ముందుకు వచ్చారు. షర్మిల పార్టీకి తమకు ఏం సంబంధం లేదన్నారు. అయితే.. తెలంగాణలో వైసీపీ ఉండబోదని తేల్చేశారు. అంటే.. ఇక తెలంగాణలో వైసీపీ అంటే షర్మిల పార్టీనే అని చెప్పకనే చెప్పారు. కానీ… వైసీపీకి ఉన్న పరిమితుల వల్ల… ఆయన చాలా నర్మగర్భంగా మాట్లాడారు. షర్మిల పార్టీకి తమ నుంచి సహకారం ఉండదు కానీ.. జగన్ ఆశీస్సులు ఉంటాయని చెప్పుకొచ్చారు. షర్మిల రాజకీయ పార్టీ తెలంగాణలో ఎంత ప్రభావం చూపిస్తుందో కానీ.. ఏపీలో మాత్రం.. వైసీపీకి ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ నేతలు గొణుక్కుంటున్నారు.
షర్మిల ఎక్కడా .. తన రాజకీయ పార్టీ ప్రచారాల్లో జగన్ పేరు కానీ ఫోటో కానీ వాడుకోవడం లేదు. కేవలం వైఎస్ఆర్ దే వాడుతున్నారు. రాజన్న రాజ్యం జగన్ అమలు చేస్తూ ఉంటే.. జగన్ ఫోటో కూడ ాపెట్టుకోవాలి కదా అన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో నడుస్తోంది. అయితే షర్మిల పార్టీకి ఇప్పుడే క్లాప్ కొట్టారు. ముందు ముందు ఇంకా చాలా చాలా షెడ్యూల్స్ జరగాల్సి ఉన్నాయి. తదుపరి పరిణామాలను బట్టి.. ఏపీ, తెలంగాణలో ఆమె పార్టీ బలం ఏమిటో స్పష్టత వస్తుందని అంటున్నారు.