గ్రేటర్ మేయర్ ఎన్నిక గురువారం జరగనుంది. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేని పరిస్థితుల్లో ఎన్నిక సజావుగా సాగే అవకాశం కనిపించడం లేదు. ఇప్పి వరకూ తాము బరిలోకి దిగబోమని చెబుతూ వస్తున్న బీజేపీ అనూహ్యంగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. మేయర్ ఎన్నిక విధానంలోనూ మార్పు చేశారు. మేయర్ ఎన్నిక కోసం మేజిక్ ఫిగర్ అవసరం లేదు, మెజార్టీ ఉంటే చాలు. ఓటింగ్ లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారు మేయర్ గా ఎన్నికవుతారు. ప్రస్తుతం గ్రేటర్లో టీఆర్ఎస్కు 56 , బీజేపీ 48 , ఎంఐఎం 44, కాంగ్రెస్ కు ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. ఒక బీజేపీ కార్పొరేటర్ చనిపోవడంతో ఓటింగ్లో పాల్గొనే చాన్స్ లేదు. అన్ని పార్టీలకు కలిపి మరో 44 మంది ఎక్స్అఫీషియో మెంబర్లు ఉన్నారు.
ఎక్స్అఫీషియో మెంబర్లతో కలిపి టీఆర్ఎస్ కు 88 ఓట్ల బలం ఉంది. తర్వాత ఎంఐఎంకు 54 ఓట్ల బలం ఉంది. మ్యాజిక్ ఫిగర్ వంటి రూలేమీ లేకపోవడంతో.. మిగతా పార్టీల కన్నా ఎక్కువ ఓట్లున్న టీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడం ఖాయగా కనిపిస్తోంది. మేయర్ ఎవరన్నదానిపై టీఆర్ఎస్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నిక జరిగే రోజునే మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను సీల్డ్ కవర్ లో తెలంగాణ భవన్ కు పంపుతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో సీల్డ్ కవర్ ఓపెన్ చేస్తారు.
మేయర్, డిప్యూటీ మేయర్ క్యాండిడేట్ల పేర్లను ప్రకటిస్తారు. మేయర్ పదవిని తమ వారసులకు ఇప్పించుకునేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. బలం ప్రకారం మూడో స్థానంలోఉన్నప్పటికీ.. బీజేపీ పోటీ చేస్తోంది. రెండో స్థానంలో ఉన్న ఎంఐఎం కూడా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. టీఆర్ఎస్ పై మజ్లిస్ ముద్ర పడకుండా ఉండాలంటే పోటీ చేయక తప్పదు. టీఆర్ఎస్ సూచనల్ని… ఎంఐఎం పాటించడానికే ఎక్కువ చాన్స్ ఉంది.