పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మావంటే మావని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రకటించేసుకుంటున్నాయి. తొలి విడత జరిగిన ఎన్నికల్లో తమ సానుభూతి పరులు 2300కుపైగా సర్పంచ్ స్థానాలను గెల్చుకున్నారని వైసీపీ, వైసీపీ అధికార మీడియా ప్రకటించుకుంది. మొత్తంగా ఎనభై నాలుగు శాతం పంచాయతీలు తమ పార్టీ అభిమానుల చేతుల్లో ఉన్నాయని చెబుతోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవాలు కాకుండా… వైసీపీ కన్నా ఎక్కువ స్థానాలు వచ్చాయని క్లెయిమ్ చేసుకుంటోంది. తొలి విడతలో వైసీపీకి ఐదు వందల వరకూ ఏకగ్రీవ స్థానాలు వచ్చాయి. అవి కాకుండా 2700కుపైగా పంచాయతీ స్థానాల్లో ఎన్నికలు జరిగితే.. తమకు పదకొండు వందలకుపైగా వచ్చాయని మరికొన్ని ఫలితాలను కావాలని నిలిపివేశారని అంటోంది.
వాస్తవంగా పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. పార్టీల సానుభూతి పరులే కానీ… సొంతంగా నిలబడతారు. అందరూ స్వతంత్రులుగానే భావిస్తారు. కానీ పార్టీ క్యాడర్ గ్రామాల వారీగా చీలిపోయి ఉంటుంది కాబట్టి… ఆ దిశగా గెలిచిన వారిని రెండు పార్టీలు తమ పార్టీ అంటే.. తమ పార్టీ క్లెయిమ్ చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అయితే సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. ప్రభుత్వంతో విరోధం పెట్టుకునేందుకు ఆసక్తి చూపించరు. ఆ ట్రెండ్ కనిపిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువగానే సర్పంచ్ స్థానాలను వైసీపీ గెల్చుకుంటోంది. ముఖ్యంగా రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో వైసీపీ .. తిరుగులేని ఆధిక్యం చూపిస్తోంది. కోస్తాతో పాటు ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థులు బలంగా నిలపడే ప్రయత్నం చేశారు. అయితే… సహజంగానే అధికార పార్టీకి ఉండే మొగ్గు పంచాయతీ తొలి విడతలో కనిపించింది. అయితే ఎక్కడా కూడా… ఏకపక్షంగా ఎన్నికలు జరగలేదన్న వాదన మాత్రం అన్ని పార్టీల నేతలు వినిపిస్తున్నారు. వైసీపీ ఎన్నో ఒత్తిళ్లు పెట్టిందని.. పోటీలు కూడా లేకుండా కేసులు పెట్టే ప్రయత్నం చేసిందని అయినా అన్నింటికి తట్టుకుని నిలబడ్డామని చెబుతున్నారు.