మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి.. హైకోర్టు ఊరటల మీద ఊరటలు ఇస్తున్నాయి. అధికారులను పబ్లిక్‌గా బెదిరించడం… ఎస్ఈసీని అసభ్యంగా తిట్టడం చేస్తున్నడాని ఆయనపై ఇరవై ఒకటో తేదీ వరకు గృహనిర్బంధం, మీడియాతో మాట్లాడకకూడదు అనే ఆంక్షల్ని ఎస్ఈసీ విధించారు. అయితే ఆయనకు హైకోర్టులో కొద్ది కొద్దిగా రిలీఫ్ వచ్చింది. మొదటగా సింగిల్ జడ్జి గృహనిర్బంధాన్ని తొలగించారు. మిగతా ఆంక్షలను ఉంచారు. అయితే మీడియాతో మాట్లాడకపోతే.. తన వాక్ స్వాతంత్ర్యాన్ని హరించినట్లేనని భావించిన పెద్దిరెడ్డి… డివిజన్ బెంచ్కువెళ్లారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఆయన పిటిషన్‌ను పరిశీలించి.. మీడియాతో మాట్లాడుకోవచ్చని ఆదేశించింది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డను మాత్రం వ్యక్తిగతంగా దూషించడం లాంటి పనులు చేయవద్దని..ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజూ మీడియా ముందుకు వస్తున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డను నానా రకాలుగా తిడుతున్నారు. చివరికి ఆయనను తన ఇంటి దొడ్లో ఉండే పశువులతో సమానం అని కూడా తీర్చేశారు. అంతే కాదు.. ఆయనకు జైలు శిక్ష వేస్తామని.. పదవీ విరమణ చేసిన తర్వాత అంతకు అంత అనుభవిస్తారని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఇవన్నీ ఎస్ఈసీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందుకే.. హైకోర్టు.. నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించవద్దని ఆదేశిస్తూ.. మీడియాతో మాట్లాడేలా ఆదేశాలిచ్చింది.
ఎన్నికలు, నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించడం తప్ప… పెద్దిరెడ్డి పెద్దగా మీడియాతో మాట్లాడేమీ ఉండదు. ఆయన ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని… విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైతే పెద్దిరెడ్డి.. కొద్దికొద్దిగా నిమ్మగడ్డ ఇచ్చిన ఆంక్షల్ని హైకోర్టు నుంచి రిలీఫ్ తెచ్చుకున్నారు. వీటిని ఉల్లంఘిస్తే… నిమ్మగడ్డ మళ్లీ హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. కానీ గవర్నర్ ఇటీవల రెండు వర్గాలతో విడివిడిగా మాట్లాడారు. దాంతో వివాదాలు ఇక ముందు రావన్న అంచనాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి.