తెలుగులో హీరోయిన్ల కొరత బీభత్సంగా ఉంది. అందుకే.. మనవాళ్ల పక్క చూపులు చూస్తుంటారు. పక్క రాష్ట్రం నుంచి అమ్మాయిల్ని దిగుమతి చేసి, హీరోయిన్లుగా మారుస్తారు. కాకపోతే.. వాళ్లతో ఒకటే సమస్య. భాష రాదు. తెలుగు నేర్పించడానికి ప్రత్యేకంగా ఓ మాస్టారుని నియమించాలి. అయినా సరే… `నాకు కొంషెం.. కొంషెం వష్షు..` అంటూ వచ్చీరాని భాషే మాట్లాడతారు. `ఉప్పెన` కోసం కృతి శెట్టిని బెంగళూరు నుంచి తీసుకొచ్చారు. తనకీ ఇలానే తెలుగు నేర్పారు. ఆ అమ్మాయి కూడా కొంచెం కష్టపడి తెలుగు నేర్చుకుంది. అయితే… తనకంటే ముందు కృతి శెట్టి అమ్మకే తెలుగు వచ్చేసిందట. కృతి.. సెట్లో డైలాగులు చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే.. కృతి అమ్మ మాత్రం సెట్లో తెలుగే మాట్లాడేదట. ఓరోజు.. కృతి సెట్లో డైలాగులు మర్చిపోతే… “పోనీ నన్ను చెప్పమంటారా“ అంటూ తెలుగులో ఆ డైలాగుల్ని అనర్గళంగా వల్లించేసిందట. దాంతో.. సెట్లో ఉన్నవాళ్లంతా షాక్ తిన్నారు. కృతికి నేర్పుదామంటే… వాళ్లమ్మ నేర్చేసుకుందేంటి? అని ముక్కున వేలేసుకున్నారు. ఈ విషయాన్ని `ఉప్పెన` దర్శకుడు బుచ్చి బాబునే చెప్పుకొచ్చాడు. హీరోయిన్ల చుట్టూ వాళ్ల మమ్మీలు… సెట్లో తిరిగేస్తుంటారు. `బేబీ.. జ్యూసు` అంటూ ప్రతి నిమిషం… బాబోగులు చూస్తుంటారు. తప్ప.. ఇలా భాషలు నేర్చేసుకున్నవాళ్లెవరూ లేరు.