విశాఖ స్టీల్ ప్రాంట్ విషయంలో ఎప్పుడో పోస్కోతో ఒప్పందం కుదిరిందని.. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదన్నట్లుగా లేఖ రాశారని విమర్శించారు. ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమీ తెలియనట్లుగా ఒక్క లేఖ రాస్తే సరిపోతుందా… అని ప్రశ్నిస్తున్నారు. ధైర్యంగా కేంద్రంతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ అంశంపై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్… కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అమిత్ షా తో పాటు కిషన్ రెడ్డిని కూడా కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని.. అది ప్రజల మనోభావాలతో కూడుకున్న విషయమని వివరించారు. కేంద్ర పెద్దలు కూడా తమ విజ్ఞప్తిని పరిశీస్తామన్నారని చెప్పుకొచ్చారు.
స్టీల్ ప్లాంట్ విషయంపై పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో చర్చలు జరుపుతున్న సమయంలోనే కేంద్రం ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. పోస్కోతో ఒప్పందం జరిగిందని అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసని.. ఉక్కు శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. పోస్కో ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో 2019 అక్టోబర్‌లో ఒప్పందం జరిగిందని.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికే 3 సార్లు పోస్కో బృందం సందర్శించిందని కూడా ప్రకటించారు. అంతే కాదు.. పోస్కో, ఆర్ఐఎన్ఎల్ మధ్య భూముల అప్పగింతకు ఒప్పందం జరిగిందని.. ఏపీ సర్కార్ కు కూడా ఈ విషయం తెలుసని స్పష్టం చేశారు. నిజంగానే ఈ విషయం జగన్ సర్కార్‌కు తెలుసు. పోస్కో బృందం కలిసిన వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఆ ఒప్పందం పూర్తి స్థాయిలో ప్లాంట్ ను పోస్కోను కట్టబెట్టడానికి కాదు. స్టీల్ ప్లాంట్ భూముల్లో కొత్త ప్లాంట్ పెట్టడానికి జరిగింది. కొత్త ప్లాంట్‌లో పోస్కో వాటా 50 శాతంగా ఉంటుందని.. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఆర్ఐఎన్ఎల్ వాటా ఎంత అనేది ఇంకా నిర్ణయించలేదు. పోస్కో, ఆర్ఐఎన్ఎల్ ఒప్పందాన్ని ప్రభుత్వాలు రహస్యంగా ఉంచాయి, ఇప్పుడు వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ చేయాలని నిర్ణయించుకున్న తర్వాతనే విషయం బయట పెట్టారు. ఈ అంశంపై .. ఏపీ సర్కార్‌ను.. వైసీపీని టార్గెట్ చేయాలని జనసేన నిర్ణయించుకుంది. మార్చి 3, 4 తేదీల్లో జనసేన, బీజేపీ రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.