వినోదం ఇప్పుడు ఇంటికే వచ్చేసింది. మొబైల్ సర్వస్వం అయిపోయింది. థియేటర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఓటీటీ ఛానళ్లలో… థియేటర్ల కంటే ముందే సినిమాలు విడుదల అయిపోతున్నాయి. వెబ్ సిరీస్లకైతే లెక్కేలేదు. సినిమాకి `మించి`న వినోదం… ఓటీటీల్లో కనిపిస్తోంది. కాకపోతే.. ఒకటే భయం. ఓటీటీలకు సెన్సార్ లేకపోవడం వల్ల బూతు కంటెంట్ ఎక్కువైపోతోంది. బోల్డ్ కంటెంట్ పేరుతో… శృంగారాన్ని ఎక్కువగా చొప్పిస్తున్నారు. కొన్ని ఓటీటీ ఛానళ్లయితే.. కేవలం బూతు కంటెంట్ తోనే పబ్బం గడుపుకుంటున్నాయి. అర్థ నగ్న సన్నివేశాలు, సెక్స్ కి ఏమాత్రం అడ్డు లేకుండా పోతోంది. కేవలం యువత బలహీనల్ని క్యాష్ చేసుకోవడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్నాయి.
వీటిపై కేంద్రం కన్నేసింది. ఎలాగైనా సరే, ఓటీటీ ఛానళ్లలో ఉండే బూతుకు కత్తెర్లు వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఓ గైడ్‌లైన్స్ ని తయారు చేసింది. అయితే.. సినిమాల మాదిరిగా.. ఓటీటీలో వచ్చే కంటెంట్ కి సెన్సార్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. ప్రతీ సెన్సార్‌కి సంబంధించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నిబంధన ఉంది. పైగా… అపరిమితంగా వస్తున్న కంటెంట్ ని సెన్సార్ చేయడం సాధ్యమైన పని కాదు. అందుకే… ఓటీటీ సంస్థలే.. స్వయంగా సెన్సార్ చేసుకోవాలని సూచించింది. అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు.. స్వయంగా ముందుకొచ్చి, స్వీయ సెన్సార్‌కి ఒప్పుకున్నాయి. కేంద్రం నిబంధనల మేరకు.. వెబ్ సిరీస్‌లను సెన్సార్ చేస్తాయని హామీ ఇచ్చాయి. అయితే… దేశంలో దాదాపు 20 వరకూ ఓటీటీ సంస్థలున్నాయి. అవన్నీ… ఈ నిబంధనల్ని అంగీకరిస్తాయా, లేదా? అనేది చూడాలి. పైగా ఒప్పుకున్నా.. స్వీయ సెన్సార్ విషయంలో ఎంత వరకూ నిజాయతీగా ఉంటాయి? అన్నదీ ప్రశ్నార్థకమే. ఆన్లైన్ వినోదాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఆ విషయం కేంద్రానికీ తెలుసు. యూ ట్యూబ్‌లోకి వచ్చే కంటెంట్ ని సైతం కేంద్రం కంట్రోల్ చేయలేకపోతోంది. ఓటీటీలు `మేం సెన్సార్ చేసుకున్నాం` అని చెప్పి బూతు కంటెంట్ ని విడుదల చేసినా.. దాన్ని పర్యవేక్షించే ఓ వ్యవస్థ.. ఉంటుందా? లేదా? అన్నది ఇంకా అనుమానం. మొత్తానికి వెబ్ సిరీస్‌లకూ… కత్తెర తప్పదన్నది అర్థం అవుతోంది. ఈ దిశగా కేంద్రం ఓ అడుగు ముందుకేయడం అభినందించ దగిన విషయమే.