విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో దక్షిణ కొరియా సంస్థ పోస్కో చాలా అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉందని… ప్లాంట్ పెట్టడమో… దాన్ని కైవసం చేసుకోవడమో చేయడం ఖాయమని తేలిపోయింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలోనే ప్రకటించింది. ఇప్పటికే ఒప్పందం అయిపోయిందని చెబుతోంది. అయితే అది కొత్తగా ప్లాంట్ పెట్టడానికే. అసలు ఉన్న ప్లాంటే అమ్మాలని నిర్ణయించుకున్నప్పుడు.. పోస్కో కొత్తది ఎందుకు పెడుతుంది..? అమ్మేదే కొనుక్కుంటుంది.. బహుశా.. అదే ప్లాన్‌తో ఒప్పందం అయిపోయి ఉంటుంది. ఇది మొత్తం… ఏపీ సర్కార్‌కు తెలుసని.. పోస్కో ప్రతినిధులు జగన్‌తో భేటీ అయ్యారని మూడు సార్లు ప్లాంట్‌ను సందర్శించారని కూడా చెప్పుకొచ్చారు.
దీంతో ఏపీలో రాజకీయ కలకలం ప్రారంభమైంది. అంతా తెలిసి ఏమీ తెలియనట్లుగా జగన్ లేఖ రాయడం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది. ఈ మొత్తం వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడానికి ప్రధాన కారణం విజయసాయిరెడ్డి. ఆయనే పోస్కోపై రాజ్యసభలో ప్రశ్న అడిగారు. విజయసాయిరెడ్డి రాజ్యసభలో లేకపోయినప్పటికీ.. విశాఖలో… స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతూ.. మాట్లాడుతున్నప్పటికీ… కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్… ఆ లేఖకు లిఖితపూర్వకంగా సమాధానం పంపారు. ఇంత వివాదం అవుతున్న సమయంలో.. ఇలాంటి సీక్రెట్లను.. విజయసాయిరెడ్డి ఎందుకు బయట పెట్టిస్తున్నారన్నది ఇప్పుడు వైసీపీ నేతలకు అంతు చిక్కని విషయంగా మారింది.
ఓ వైపు స్టీల్ ప్లాంట్ కార్మికుల దగ్గరకు వెళ్లి పట్టు విడుపులు ఉండాలని నచ్చ చెప్పే ప్రయత్నం చేయడం.. మరో వైపు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పూర్తిగా ప్రభుత్వానికి తెలిసే జరుగుతుందని తెలియచేయడం.. ఆసక్తికరంగా మారుతోంది. విజయసాయిరెడ్డి సొంత పార్టీకి చిక్కులు తెచ్చి పెడుతున్నారా లేకపోతే.. ఆ పార్టీ వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్నారా అన్నది అంతు చిక్కని అంశంగా మారింది.