జీతాలు పెంచమని ఉద్యమిస్తున్న మానస పుత్రులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి .. అది చేయలేం కానీ… సేవలకు ప్రతిఫలంగా బిరుదులు, సత్కారాలు చేస్తామని ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాలంటీర్లకు జీతాలు పెంచే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని నేరుగా చెప్పడం లేదు కానీ.. ఏడాది కిందట చెప్పిన రూ. ఎనిమిది వేలు కూడా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని మాత్రం స్పష్టమైన సందేశాన్ని వాలంటీర్లకు పంపుతున్నారు. అయితే వారిని నిరాశపర్చకుండా… ఉగాది రోజు సన్మానాలు. సత్కారాలు, బిరుదులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వాలంటీర్లు చేసే స్వచ్చంద సేవ మాత్రమేనని ఒక్క రోజు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఉపదేశంతో బహిరంగలేఖ రాశారు. ఎక్కువ చేస్తే వాలంటీర్ వ్యవస్థ ఉండదన్న నర్మగర్భ సంకేతాలు కూడా ఆ లే్ఖలో ఉన్నాయి. అయితే.. వారి సేవకు తగ్గ గుర్తింపును ఇస్తామని జగన్ చెబుతున్నారు. అందుకే వారికి ప్రత్యేకమైన బిరుదుల్ని పంపిణీ చేయబోతున్నారు. అలాగే సత్కారాలు కూడా చేస్తారు. కానీ.. వీటికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కల్పించరు. వాలంటీర్లలో ఉత్తమ వాలంటీర్లను ఎంపిక చేసి.. ఈ బిరుదులు, సత్కారాలు ఇస్తారు.
వాలంటీర్ల సేవలపై ప్రభుత్వానికి ఓ స్పష్టమైన అవగాహన ఉంది. వారేమీ పెద్దగా కష్టపడటం లేదన్న భావనలో ఉన్నారు. వారికి మూడు రోజులు మాత్రమే పని చేస్తున్నరని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ అయితే.. రోజుకు అరగంట మాత్రమే వారికి పని ఉంటోందన్నారు. వైసీపీ పార్టీ నేతలు అయితే మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. సాక్షి టీవీలో ప్రసారమయ్యే.. కొమ్మినేని టాక్ షోలో పాల్గొన్న లక్ష్మి పార్వతి వాలంటీర్లు ఎంత అవినీతికి పాల్పడుతున్నారో ప్రభుత్వం వద్ద రికార్డు ఉందని.. అయినా చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారని… చెప్పుకొచ్చారు. ఆ కృతజ్ఞత కూడా వారికి లేదనేశారు. మొత్తానికి సీఎం జగన్ జీతాలు పెంచలేమని చెబుతూ.. వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తూంటే.. వైసీపీ నేతలు మాత్రం వారిని కించ పరిచేందుకు వెనుకాడటం లేదు. అచ్చంగా ఇది రాజకీయ వ్యూహంగా ఉందన్న అభిప్రాయం ఇతర వర్గాల్లో వినిపిస్తోంది.