విగ్రహాలను కూల్చేశానని… క్రిస్టియన్ గ్రామాలను వందల కొద్దీ ఏర్పాటు చేశానని గొప్పగా ప్రకటించేసుకున్న పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌కు బెయిల్ వచ్చేసింది. ప్రతీ ఆదివారం ఆయన పోలీసులు ముందు హాజరు కావాలన్న నిబంధనతో బెయిల్ ఇచ్చేశారు. పోలీసులు కూడా ఇతర టీడీపీ నేతల్ని అరెస్ట్ చేసినప్పుడు చెప్పే … బయటకు వెళ్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని.. బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిఅని సాక్షుల్ని బెదిరిస్తారని లాంటి వాదనల్ని కోర్టులో వినిపించలేదు. దాంతో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆయన తిన్నగా మళ్లీ చర్చికెళ్లిపోతారు. తన పనితాను చేసుకుంటారు. కానీ ఆయన చెప్పినట్లుగా విగ్రహాల ధ్వంసాలు… క్రైస్తవ గ్రామాల గురించి మాత్రం.. సీఐడీ పోలీసులు ఇంత వరకూ ఏదీ తేల్చలేదు.
మొదట పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వీడియోలు బయటకు వచ్చే వరకూ ఆయన పై ఈగ వాలలేదు. ఏపీలో ఆలయాలపై దాడులు విస్తృతంగా జరుగుతున్న సమయంలో ఆయన వీడియో బయటకు వచ్చింది. అప్పటికే… ఆలయాలపై దాడుల అంశం రాజకీయం అయింది. మీ పార్టీ వారు చేశారంటే.. మీ పార్టీ వారు చేశారని వాదించుకోవడం ప్రారంభించారు. అయితే విదేశీ ఫండ్స్ కోసం కొంత మంది క్రైస్తవ సంస్థలు పెట్టి.. ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని.. వీటిని చూపించి… నిధులు రాబడుతున్నారని పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక స్పష్టమయింది. దీని వెనుక ఉన్న రాకెట్‌ను బయట పెట్టాల్సిన సీఐడీ పోలీసులు ఏమీ తేల్చలేకపోయారన్న విమర్శలు ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. కానీ ఇటీవలి కాలంలో ఆయన ఆస్తులు కోట్లకు పెరిగిపోయాయి. పెద్ద పెద్ద భవనాలతో క్రైస్తవ విద్యాసంస్థలు నడుపుతున్నారు. పెద్ద పెద్ద ఆస్తులు సమకూరుతున్నాయి. బ్రదర్ అనిల్ సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారమూ ఉంది. అయితే.. ఏ ఒక్క విషయాన్ని పోలీసులు బయట పెట్టలేదు. అత్యంత రహస్యంగా విచరాణ జరిపారు. వివరాలు అంతే సీక్రెట్‌గా ఉంచారు. ఇప్పుడు బెయిల్ కూడా వచ్చేసింది. పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఇక అన్నీ ప్రచారాలుగానే ఉండిపోనున్నాయి. నిజాలు తేలేది ఎప్పుడో..?