కొత్త సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు.. అంటూ తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో జీవో విడుదల చేసేసింది. అయితే సంక్రాంతికి వచ్చిన సినిమాలేవీ అంత సాహసం చేయలేదు. ప్రేక్షకుల్ని థియేటర్లకు అలవాటు చేయడమే లక్ష్యంగా… టికెట్ రేటు జోలికి వెళ్లలేదు. అయితే.. శుక్రవారం విడుదల అవుతున్న `ఉప్పెన` మాత్రం టికెట్ రేట్లు పెంచే సాహసం చేసేసింది. మైత్రీ మూవీస్ సంస్థ రూపొందించిన చిత్రం ఉప్పెన. వైష్ణవ్ తేజ్ కథానాయకుడు. విజయ్ సేతుపతి ప్రతినాయకుడు. ఈ సినిమాకి విడుదలకు ముందే మంచి బజ్ ఏర్పడింది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది నిర్మాణ సంస్థ.
ఐమాక్స్ లో ఉప్పెన టికెట్ రేటు 350 రూపాయలకు చేరింది. ఇతర మల్టీప్లెక్స్‌లలో 200 నుంచి 250 వరకూ ఉంది. సింగిల్ స్క్రీన్లలో ఉప్పెన చూడాలంటే 150 చెల్లించాల్సిందే. కొన్ని థియేటర్లలో కొత్త సినిమా వస్తే… 150 వసూలు చేస్తున్నారు. ఈ దెబ్బకు ఆ రేటు 200 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలొచ్చినప్పుడు టికెట్ రేటు పెంచడంలో ఓ అర్థం ఉందని, ఇలాంటి సినిమాలకు సైతం.. టికెట్ రేట్లు అమాంతం పెంచడం ఏమిటని? సగటు ప్రేక్షకుడు ప్రశ్నిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్‌కి ఇదే తొలి సినిమా. దర్శకుడు బుచ్చిబాబుకీ అంతే. అయితే.. ఈ సినిమా బడ్జెట్.. పెరుగుతూ పోయింది. దాదాపు 30 కోట్లకు చేరింది. దాన్ని రాబట్టుకోవాలంటే టికెట్ రేట్లు పెంచుకోవడం మినహా మరో మార్గం లేకుండా పోయింది. పైగా.. మైత్రీ మూవీస్ ఈ సినిమాని సొంతం గా విడుదల చేసుకొంటుంది. అందుకే ఆ రిస్క్ తానే తీసుకుంది. కాబట్టే.. టికెట్ రేటు పెంచేసింది. తొలి మూడు రోజులూ … ఈ రేటే ఉండొచ్చు. తొలి రోజు.. ఈ సినిమాకి ఉన్న బజ్ దృష్ట్యా. మంచి ఓపెనింగ్స్ ఉండొచ్చు. కాకపోతే… రిపోర్ట్ అటూ ఇటూ ఉంటే మాత్రం ఈ రేటుకి సామాన్యుడు థియేటర్‌కి వెళ్లే రిస్క్ చేయడం అసాధ్యమే.