గ్రేటర్ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇలా ఎంఐఎం మద్దతు తీసుకోవడం ఆలస్యం .. అలా భారతీయ జనతా పార్టీ తనదైన రాజకీయాన్ని ప్రారంభించింది. అసలు బీజేపీకి ఎలాంటి చాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఇంత వరకూ టీఆర్ఎస్ .. ఎంఐఎంతో కలిసి మేయర్ సీటును కైవసం చేసుకుంటామని ప్రకటించలేదు. మేయర్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ వచ్చాయి. అయితే అంతర్గతంగా మాత్రం చర్చలు జరిగాయి. ఎంఐఎంకు డిప్యూటీ మేయర్ ను కేసీఆర్ ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. అయితే.. వద్దని అనుకున్నారట.
అందుకే.. డిప్యూటీ మేయర్ కూడా టీఆర్ఎస్ పార్టీనే కైవసం చేసుకుంది. ఇద్దరికీ.. ఎంఐఎం మద్దతు ఇచ్చింది. ఇది బీజేపీ ఊహించిందో లేదో కానీ.. మంచి చాన్స్ దొరికిందని.. విమర్శల వర్షం ప్రారంభించారు. పొత్తు లేదని చెప్పుకుని ఇప్పుడు బల్దియాలో కలిసి పాలన ప్రారంభించారని టీఆర్ఎస్, ఎంఐఎం అక్రమ సంబంధం మరోసారి బహిర్గతమైందని బండి సంజయ్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంటుందని.. రెండు పార్టీలు కలిసి భాగ్యనగరాన్ని దోచుకుంటాయన్నారు.
రాజా సింగ్ కూడా ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు ఎంఐఎంతో లింక్ పెట్టడానికి బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. గ్రేటర్ మేయర్ పీఠానికి మజ్లిస్ మద్దుత తీసుకోవడం ద్వారా… దానికి బలాన్ని టీఆర్ఎస్సే ఇచ్చినట్లయింది. ఇప్పుడు బీజేపీ నేతలు చేసే పొలిటికల్ ఎటాక్ కు సమాధానం రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి టీఆర్ఎస్పై పడింది.