మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైదరాబాద్‌లో వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌లతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. వీరితో భేటీ అయ్యేందుకు ప్రత్యేకంగా అమరావతి నుంచి ఆళ్ల వచ్చారు. మామూలుగా అయితే ఆళ్లతో చర్చించాల్సినంత విషయాలు షర్మిలకు.. బ్రదర్ అనిల్‌కు ఉండవు. అందుకే జగన్మోహన్ రెడ్డి దూతగా వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆలోచన విరమించుకోవాలని ఆమెకు కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి వస్తోందని చెబుతున్నారు. అయితే అన్నీ ఆలోచించుకునే షర్మిల రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు. అయితే ఇప్పటికీ పార్టీ ప్రకటన చేయలేదు కాబట్టి.. ఎలాగోలా ఆపాలన్న ప్రయత్నంలో భాగంగానే ఆళ్లను పంపినట్లుగా భావిస్తున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు కోసం కసరత్తు ముమ్మరం చేశారు. ఆమెను నిలువరించాలని .. కుటుంబసభ్యులు చాలా ప్రయత్నాలు చేసినట్లుగా.., జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఎంతో నచ్చ చెప్పామని కానీ వినలేదన్నారు. చివరికి ఫలితాలు ఆమే అనుభవిస్తుందని.. తమకేమీ సంబంధం లేదని తేల్చేశారు. కానీ.. ఇప్పటికీ.. ఆమెను రాజకీయ పార్టీ పెట్టకుండా నిలువరించేందుకు జగన్మోహన్ రెడ్డి వర్గం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో రాజకీయ పార్టీ పెడితే.. అనేక రకాల సమస్యలు వస్తాయని… అవన్నీ వైసీపీకి.. జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా.. సమాధానం చెప్పుకోలేనివిగా మారుతాయన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది.
అదే సమయంలో… తెలంగాణలో.. తెలంగాణ రాష్ట్ర సమితికి అన్ని విధాలుగా అండగా ఉంటామని… ఏపీలో కేసీఆర్ సహకారం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు షర్మిల పార్టీ పెడుతూండటంతో… ఆయనపై కూడా టీఆర్ఎస్ వర్గాలు గుర్రుగా ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి చెల్లిని నచ్చ చెప్పేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగంగా కొత్త ప్రతిపాదనలతో … మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పంపారని చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి వాటికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ముందు ఉంటారు. ఆయన సొంతంగా చొరవ తీసుకునే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు వైసీపీలో ఉండవు. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకునేంత సీన్ వైసీపీలో ఎవరికీ లేదు. అందుకే ఆళ్లను.. ప్రత్యేకంగా జగన్ వర్గమే పంపి ఉంటుందని భావిస్తున్నారు.