ఆడవాళ్లను పొగిడి చూడండి..! నమ్మేస్తారు..!. ఎదుటి వాళ్లు తనను ఇంప్రెస్ చేయడానికి పొగుడుతున్నారని వాళ్లకు తెలుసు. అయినా అలా కాదులే అని చెప్పరు. నమ్మేస్తారు..!. అది ఆడవాళ్ల బలహీనత. ఇప్పుడు రాజకీయ నాయకులు అదే రేంజ్లో ప్రజల్ని ఆడుకుంటున్నారు. వారి బలహీనతను కనిపెట్టి.. దాన్ని పెంచి పెద్దది చేసి… రియాల్టీషోలు నడిపిస్తున్నారు. వాళ్లు ఆడుతున్నది నాటకం.. అది నిజం కాదు.. అని ప్రజలకు తెలుసు. అయినా సరే.. నిజం తెలిసినా ఒప్పుకోనంతగా ప్రజల్ని మభ్య పెట్టేస్తున్నారు. ఇతర పార్టీలతో కలిసి పొలిటికల్ రియాల్టీ గేమ్ షో ఆడుతున్నారు. ఈ గేమ్‌లో ప్రేక్షకులు ప్రజలే.. బకరాలు కూడా ప్రజలే.
పొలిటికల్ తెరపై ఇప్పుడు షర్మిల పార్టీ షో…!
తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. షర్మిల రాజకీయ పార్టీ పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆమె రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ బయట పెట్టినప్పుడు అందరూ నవ్వారు. ఎందుకంటే… అందులో అంత కామెడీ ఉంది. అసలు తెలంగాణ ఎలా ఏర్పడింది..? . తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రా పార్టీలు పేరుతో కనుమరుగైన పార్టీలు ఎన్ని..? నేతలు ఎంత మంది..?. వారి ఆత్మగౌరవ నినాదం ఎంత పవర్ ఫుల్..? ఇలాంటివన్నీ ఒక్క సారిగా రీల్‌గా కళ్ల ముందు కనిపిస్తే.. ఖచ్చితంగా స్టాండప్ కామెడీలో సూపర్ స్కిట్‌గా ఉంటుంది. షర్మిల ఎవరు..?. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చనిపోయిన ఓ రాజకీయ నేత కుమార్తె మాత్రమే. ఆమె ఇంతకు ముందు ఏం చేసింది..? సంఘ సేవ చేసిందా..? ప్రజల్ని ఆదుకుందా..? ఏమీలేదు. మరి ఎందుకు ఆమెకు తెలంగాణ ప్రజలు ఓట్లేస్తారు..? స్వయం పాలన కోరుకుని ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ప్రజలు షర్మిల రాజకీయ పార్టీ అనే మాటను సీరియస్‌గా తీసుకుంటారా..? చాన్సే లేదు. కానీ కొన్ని మీడియాలు తీసుకుంటాయి. ఎందుకు తీసుకుంటాయో వారికి తెలుసు. తెలియాల్సిన వాళ్లకు తెలుస్తాయి. షర్మిల రాజకీయ పార్టీ పెట్టుకుంటే.. ఏపీలో పెట్టుకోవాలి. అంతగా రాజన్న రాజ్యం కావాలంటే ఆ పనే చేయాలి. ఎందుకంటే..ఆమెకు తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదు. మానసిక.. సాంస్కృతి… చారిత్రక.. ఇలా ఎలాంటి సంబంధమూ లేదు. అలా లేకుండా… తెలంగాణలో జెండా ఎలా పాతగలరు..?. ఈ విషయం అందరికీ తెలుసు. ఆమెను మోస్తున్న మీడియాకూ తెలుసు. కానీ వారు మోస్తారు. వారంతా పొలిటికల్ రియాల్టీషోలో ఓ భాగం. షర్మిల తెలంగాణ తెరపై ఎందుకు వచ్చారో..? ఏపీ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారో…? అన్న ఫోటోల్ని ఎందుకు దూరం పెడుతున్నారో…? అన్నీ బహిరంగరహస్యాలే. కానీ ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు నాటకం రక్తి కడుతోంది. నిజం కళ్ల ముందు కనిపిస్తున్నా… ప్రజలు అంగీరించలేనంత మెస్మరైజేషన్ను ప్రస్తుతం రాజకీయ పార్టీలు నేర్చుకుంటున్నాయి. ఎలా అంటే… ముందుగా చెప్పుకున్నట్లుగా.. ఆడవాళ్లను పొడిగితే.. అబద్దాలు అని తెలిసినా యాక్సెప్ట్ చేస్తారు.. ఇది కూడా అంతే. ప్రజల మనసుల్లో ఓ రకమైన భావజాలాన్ని నింపి… దానికి వ్యతిరేకంగా కళ్లు ముందు జరిగిన దాన్ని కూడా నమ్మకుండా చేయడంలో రాజకీయ పార్టీలు ఎక్స్పర్టైజ్ అవుతున్నాయి. అందులో భాగంగా మీడియా కూడా తోలుబొమ్మలాట ఆడిస్తోంది. దానికి షర్మిల ఉదంతమే ఉదాహరణ.
ఏపీలో స్టీల్ ఫ్యాక్టరీ స్కిట్ చేస్తున్న రాజకీయ నేతలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయల్లో ఈ పొలిటికల్ రియాల్టీ షో మరీ ఓవర్. దాడులు, దౌర్జన్యాలు, పోలీసు కేసులు.. ఇలా లెక్క లేనన్ని అక్రమాలతో పంచాయతీ ఎన్నికలు నడుస్తున్నాయి. అయినా రాజకీయ పార్టీలు తెరపైకి వచ్చి.. మాకు తొంభై శాతం ఫలితాలంటే.. మరొకరు మాకు యాభై శాతం ఫలితాలని చెప్పుకుని ప్రజల్ని మభ్య పెట్టేస్తున్నారు. ఈ ఎన్నికల డ్రామా గురించి పక్కన పెడితే… అన్నీ తెలిసే జరుగుతున్నా.. ఏమీ తెలియనట్లుగా రాజకీయ పార్టీలు నాటకాలాడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయ పార్టీల డ్రామాలు మరీ ఎక్కువయి పోయాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఇప్పటివి కావు. నాలుగైదేళ్ల నుంచే ఉన్నాయి. ఆ విషయం అప్పటి ప్రభుత్వానికి తెలుసు. ఇప్పటి ప్రభుత్వానికి తెలుసు. కానీ ఏమీ తెలియనట్లు .. కుట్ర అంటూ ఉద్యమాలకు బయలుదేరాయి. పోనీ ప్రజలకు తెలియదా.. అంటే… కాస్త కనీస లోకజ్ఞానం ఉన్న వారందరికీ తెలుసు. గత నాలుగైదేళ్ల కాలంలో… ప్రైవేటీకరణ విషయంలో… ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు ఎన్ని సార్లు గేటు మీటింగ్‌లు పెట్టుకున్నాయో… ఎన్ని సార్లు తమ వ్యతిరేకత తెలియచేశారో లెక్కేలేదు. కానీ.. పొలిటికల్ రియాల్టీషోలో ఇప్పుడు… స్టీల్ ప్యాక్టరీ టాస్క్ నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తే… వారు ప్రజలకు ఓట్లు వేస్తారు. వారిది కేవలం ఫర్ఫార్మెన్స్ అని ప్రజలకు కూడా తెలుసు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు.. కుట్రని రంకెలు వేసినా.. టీడీపీ నేతలు ఆమరణ నిరాహారదీక్షలు చేసినా.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేరు ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. అయినా సరే ఆ పార్టీలు ఆడుతున్న డ్రామాలను చూసి… ఎవరు బాగా చేశారని అనిపిస్తే వారికి పట్టం కడతారు. స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైనింగ్ లేకపోవడమే మైనస్. అలాంటి గనులు ఇవ్వాల్సిన అవకాశం వచ్చినప్పుడు.. అసలు ఫ్యాక్టరీనే లేని గాలి జనార్థన్ రెడ్డి లాంటి వాళ్లకు గనుల్ని కట్ట బెట్టారు. ఇప్పుడు అదే శాపం.. స్టీల్ ప్లాంట్‌కు తగులుతోంది. ఆ గనులే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఉంటే… ప్రపంచంలోనే భారీ లాభాలు ఆర్జించే ఉక్కు కంపెనీల్లో ఒకటిగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఉండేది. కానీ ఇప్పుడు చరిత్రలో కలిసిపోతోంది.
రైతులతో మోడీ గేమ్ మామూలుగా ఉండదు..!
తెలంగాణ, ఏపీలోనే కాదు.. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలోనూ రియాల్టీ షో జోరుగా నడుస్తోంది. ప్రస్తుతం రైతు ఉద్యమం కేంద్రంగా రాజకీయం నడుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తనకు రైతులంటే ఎంతో అభిమానమని పవిత్రమైన చట్ట సభల్లో చెబుతారు. కానీ… ఆయన ఆందోళన చేస్తున్న రైతుల్ని మాత్రం.. ఖలిస్థాన్ వేర్పాటువాదులుగా అభివర్ణించడానికి ఏ మాత్రం వెనుకాడరు. వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని చెప్పకుండా ఉండరు. ఆ రైతులు… ఎర్రకోటపై జాతీయ జెండాలను తొలగించకపోయినా… తొలగించారని చెప్పి ప్రజల్లో వారిపై ఆగ్రహం తెప్పించడానికి ప్రయత్నించకుండా ఉండరు. శివార్లలోని రైతులకు కనీస అవసరాలు అందకుండా ఏర్పాట్లు చేయకుండా ఉండరు. రైతులు ఎక్కడ ఢిల్లీలోకి వస్తారో అని.. కందకాలు తవ్వించేసి.. ఇనుప ముళ్లు చుట్టూ పాతకుండాఉండరు. కానీ మాటలు చెప్పడానికి వస్తే మాత్రం… తీయగా చెబుతారు. కళ్ల ముందు రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్న విధానం చూస్తూ కూడా.. అనేక మంది ఆయన చెప్పే మాటల్ని నమ్ముతారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. రైతు చట్టాలను ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. ప్రతిపాదించింది కూడా. అయితే.. ఇప్పుడు… ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కే సరికి… కాంగ్రెస్ కూడా గొంతు సవరించుకుని రంగంలోకి దిగింది. తాము వస్తే.. ఆ చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇస్తోంది. ఇదెలా ఉందంటే… 2014 ఎన్నికలకు ముందు గ్యాస్ సబ్సిడీ నగదు బదిలీ, పెట్రోల్ రేట్ల పెంపు సహా అనేకానేక కాంగ్రెస్ నిర్ణయాలను తాము వచ్చాకవెనక్కి తీసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ వచ్చాక మరింత కఠినంగా అమలు చేసింది. రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చినా… కొత్త వ్యవసాయ చట్టాలను తొలగించేసి.. అంత కంటే కఠినమైన చట్టాలు తెస్తారు. అది సహజం. ఇవన్నీ ప్రజలకు తెలుసు. కానీ వారు.. పొలిటికల్ పార్టీల రియాల్టీ షోలనే ఎక్కువగా నమ్ముతున్నారు.
ప్రజలు నిజాన్ని కాదు.. పొలిటికల్ రియాల్టీ షోలనే నమ్ముతున్నారు..!
జీవితమే ఓ నాటకం అన్నారు పెద్దలు. సందర్భానికి తగినట్లుగా నటిస్తూ బతకడమే మానవుని జీవితం. ఈ నటన ఇప్పుడు రాజకీయ రంగంలో తారస్థాయికి చేరింది. నటిస్తున్నారని తెలిసినా ప్రజలు .. ఆ నటనలో మేలైన నటనను ఎంచుకుంటున్నారు తప్ప.. నిజాయితీ కోసం వెతకడం లేదు.అందుకే… రాజకీయం రాను రాను రియాల్టీ షోగా మారుతోంది. అందులో పర్ఫార్మెన్స్ ఇచ్చే వాళ్లే సక్సెస్ అవుతున్నారు. ప్రజాసమస్యలు, అభివృద్ధి… లాంటివన్నీ.. స్కిట్ల కోసం ముడి సరుకులు. నిజంగా అవి ఉండవు.. కనిపించవు.