గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కడప జిల్లా పులివెందులను మించి అభివృద్ధి సాధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ నియోజకవర్గంలో 77 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఎక్కడా ఎలాంటి సందడి లేదు. దానికి కారణం 73 పంచాయతీల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. కేవలం నాలుగు అంటే నాలుగు గ్రామాల్లో ప్రత్యర్థులు బరిలో ఉన్నారు. వారిని కూడా వ్యూహాత్మకంగా ఉంచారు. వారి నామినేషన్లు లేకపోతే.. అభ్యర్థుల చీటీలు చించేసి ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఎంతో పట్టు ఉండే పులివెందుల నియోజకవర్గంలో కూడా.. ఇంత స్థాయిలో ఏకగ్రీవాలు కాలేదు. కానీ మాచర్ల మాత్రం.. పులివెందులను దాటి వెళ్లిపోయింది.
ఒక్క గ్రామాల్లోనే కాదు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. చివరికి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎవరూ నామినేషన్లు వేయలేదు. అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యంలో పాల్గొనాల్సిన అవసరం లేదని నామినేషన్లు కూడా అవసరం లేదని ఎందుకు భావిస్తున్నారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా టీడీపీ కార్యకర్తలను అడ్డుకుంటున్నారని .. బెదిరిస్తున్నారని తెలిసి… బుద్దా వెంకన్న, బోండా ఉమ మాచర్ల వెళ్లారు. అంతే.. వారిని హత్య చేయడానికి కూడా అక్కడ కొంత మంది వెనుకాడలేదు. చివరికి బతుకు జీవుడా అంటూ వెనక్కి వచ్చారు. ఆ ఘటన తర్వాత ఎవరూ ఎన్నికల్లో పాల్గొనేందుకు సాహసించడం లేదు.
గ్రామాల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉన్నాయి. ఎవరైనా వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేయాలనుకుంటే.. అతనికి గ్యారంటీ లేదనే సంకేతాలు వెళ్తున్నాయి. పల్నాడులో ఇతర చోట్ల కూడా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ.. మాచర్లలో ప్రజాస్వామ్యం పూర్తిగా కనిపించకుండా పోయింది. అధికారులు కానీ.. ఎస్ఈసీ కానీ పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ప్రజాప్రతినిధులకు 90 శాతం ఏకగ్రీవాల టార్గెట్ ఇచ్చారు. మిగతా వారు చేయలేకపోతున్నారు. కానీ మాచర్ల ఎమ్మెల్యే మాత్రం.. పూర్తి చేసి చూపిస్తున్నారు. ఆయన మంత్రి పదవి టార్గెట్ పెట్టుకున్నారు. దాని కోసం ముఖ్యమంత్రిని మెప్పించేందుకు అన్ని ఏకగ్రీవాలు చేసేస్తున్నారు.