రెండు నెలల క్రితం యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. అందుకే ఈ ప్రకటన.. ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు అని. కానీ తర్వాత చాలా సీరియస్‌గా అధికారులు సమీక్ష చేశారు. నిజంగా నోటిఫికేషన్లు ఇచ్చేస్తారేమోనని అనేక మంది ఉద్యోగార్థులు ప్రిపరేషన్ కూడా ప్రారంభించారు. అలాగే ఉద్యోగుల పీఆర్సీ కూడా. ఎప్పటి నుండో పెండింగ్ లో ఉన్న పీఆర్సీ కమిటీని ప్రభుత్వానికి సమర్పింపచేసేలా చేశారు. అయితే దానిపై ఉద్యోగులు ఏకాభిప్రాయానికి రాకుండా మరీ ఫిట్‌మెంట్‌ను ఏడున్నర శాతమే ఉండేలా చూసుకున్నారు. దాంతో ఉద్యోగసంఘాలు తాము సీఎంతోనే తేల్చుకుంటామన్నారు. ఇదిగో సీఎంతో సమావేశం.. అదిగో సీఎంతో సమావేశం అంటూడంగానే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చేసింది.
తెలంగాణలో రెండు పట్టబద్రుల స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలచేసింది. ఈ నెల 16న నోటిఫికేషన్ వెలువడుతుండగా… మార్చి 14న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవి ముగిసే లోపు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుంది. అది పూర్తయ్యేలోపు వరంగల్,ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నోటిఫికేషన్లు సైతం రానున్నాయి. దీంతో ఎన్నికల కోడ్ దాదాపు 4నెలలు ఉండనుంది. కోడ్ ఉన్న సమయంలో ఉద్యోగుల జీతాలు పెంపు..నోటిఫికేషన్లు ఇవ్వడంలాంటి నిర్ణయాలు తీసుకోడానికి అవకాశం లేదు. అఫ్ కోర్స్ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చని… ఆంధ్రప్రదేశ్‌ను చూస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ కేసీఆర్ మాత్రం కోడ్ కారణంగా ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ పెంపు వంటి నిర్ణయాలు తీసుకోరని చెబుతున్నారు.
కోడ్ వచ్చే వరకు కావాలనే సర్కార్ పీఆర్సీ ఫైల్ పెండింగ్ లో పెట్టిందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పదవీ విరమణ వయస్సును అరవై ఏళ్లకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. అదేదో పెంచితే తమకు రెండేళ్ల సర్వీస్ వస్తుందని.. రిటైరయ్యే ఉద్యోగులు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడా చాన్స్ లేదు. ఉద్యోగులకు జీతాలు పెంచడం కేసీఆర్ కు ఇష్టం లేదని…. ఉద్యోగులు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏళ్ల తరబడి సర్కార్ కొలువులకోసం నీరీక్షణ చేస్తుంటే …ఈ నెలలోనే నోటిఫికేషన్లు వెలువడుతాయనుకుంటే నిరాశ ఎదురవుతోంది.
నాగార్జున సాగర్‌లో సభ పెట్టిన కేసీఆర్.. నల్లగొండ జిల్లాకు నిధుల హామీల వర్షం కురిపించారు. ఎక్కడ సభ పెట్టినా ఆయన ఇలా నిధుల ప్రకటనలతో అందర్నీ విస్మయపరుస్తారు. గతంలో హుజూర్ నగర్ ఉపఎన్నిక సమయంలోనూ అలాంటి ప్రకటనలే చేశారు. ఎన్ని నిధులు వచ్చాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు కూడా అంతేనని ఎక్కువ మంది చర్చించుకుంటున్నారు. కేసీఆర్ హామీలు అంటే ఎన్నికల వరకేనని.. విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి.