ఉద్దేశపూర్వకంగా ఎస్‌ఈసీని తూలనాడి… వివరణ అడిగే సరికి.. తూచ్ అనేసిన మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానిని ఎస్ఈసీ నిమ్మగడ్డ లైట్ తీసుకోవాలనుకోవడం లేదు. ఆయన వివరణతో ఏ మాత్రం సంతృప్తి చెందలేదు. ఆయనపై ఇతరులపై విధించినట్లుగానే… మీడియాతో మాట్లాడకపోవడం ఆంక్షలతో పాటు పోలీసు కేసులు పెట్టాలని కూడా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశించారు. ఏయే సెక్షన్ల కింద కేసులు పెట్టాలి.. .ఏ క్లాజులు కింద నేరాభియోగాలు పెట్టారో కూడా ఆదేశాల్లో ఎస్‌ఈసీ నిర్దేశించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అసలు విషయం మాత్రం ఇప్పుడే ప్రారంభమవుతుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను పాటించిన వారిని బ్లాక్ లిస్టులో పెడతామని… ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే చెబుతున్నారు.
అందుకే పెద్దిరెడ్డి విషయంలో స్వయంగా డీజీపీ కూడా… తనకు లిఖిత పూర్వక ఆదే్శాలు అందిన తర్వాతనే ఆలోచిస్తామని చెప్పుకొచ్చారు. పైగా ఇప్పుడు కొడాలి నాని కూడా స్వయంగా ప్రభుత్వ పెద్దల దిశానిర్దేశం మేరకే ప్రెస్ మీట్ పెట్టారనేది బహిరంగ రహస్యం. ఆయనపై చర్య తీసుకుంటే… ప్రభుత్వం తాను తప్పు చేసినట్లుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు పోలీసులు కేసులు పెడతారా లేదా అన్నది ఓ ప్రశ్న. ఇటీవలి కాలంలో ఇలా చర్యలు తీసుకుంటున్న వారు అందరూ కోర్టుల్లో హౌస్ మోషన్ పిటిషన్లు వేస్తున్నారు. వారందరికీ కోర్టుల్లో.. కొంత రిలీఫ్ దొరుకుతోంది. ఇప్పుడు కొడాలి నాని కూడా తనపై కేసు పెట్టకుండా హౌస్ మోషనో… లంచ్ మోషనో వేసే అవకాశం ఉంది.
ఒక వేళ అలా వేస్తే.. విచారణ జరిగి తీర్పు వచ్చే వరకూ పోలీసులు కేసు పెట్టరు. ఎలాగోలా బండి నడిపించేసి.. చివరికి… కోడ్ అయిపోయిన తర్వాత లైట్ తీసుకునే వ్యూహం కూడా అమలు చేయవచ్చు. ఇక్కడ అసలు విషయం… కొడాలి నానిపై కేసు పెడతారా లేదా అన్నది కాదు.. ఎస్‌ఈసీ అధికారాలను కిందిస్థాయి ఉద్యోగులు కూడా.. ఎలా మానిప్యులేట్ చేస్తున్నారన్నదే కీలకం. మీ అధికారాలు ఉపయోగించాలని హైకోర్టుసూచించినా…. నిమ్మగడ్డ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి వెళ్లిపోతున్నారని టీడీపీ నేతలు కూడా అందుకే.. విమర్శలు గుప్పిస్తున్నారు.