మాచర్ల, పుంగనూరులో రికార్డు స్థాయి ఏకగ్రీవాలు.. అంటే దాదాపుగా 95 శాతం ఏకగ్రీవాలు కావడంపై అంతటా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. హైకోర్టుకు కూడా అలాగే అనిపించింది. తక్షణం ఏకగ్రీవాలపై విచారణ జరిపి ఒక్క రోజులో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మాచర్ల, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో ఓటర్లు, అభ్యర్ధులను భయపెట్టడం… నామినేషన్లను అకారణంగా తిరస్కరించడం.. వంటివి చేసి బరిలో ఎవరూ నిలబడకుండా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 90 శాతం ఏకగ్రీవాలు చేయాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు వారు ఇలా చేశారని ..ఒకరు మంత్రి పదవిని సుస్థిరం చేసుకోవడానికి మరొకరు… మంత్రి పదవి పొందడానికి తమ తమ నియోజకవర్గాల్లో అరాచకాలకు తెర లేపారని ఆరోపణలు వస్తున్నాయి.
అందుకే ఏకగ్రీవాలపై విచారణ జరపాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు… మాచర్ల, పుంగనూరుల్లో ఏకగ్రీవాలపై ఒక్క రోజులో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ .. ఎలాంటి విచారణ జరిపినా వారికి పాజిటివ్ రిపోర్టే వస్తుంది. కొద్ది రోజుల కిందట.. తొలి విడత ఏకగ్రీవం అయిన పంచాయతీలపై ఆయన దృష్టి సారిస్తే.. ఆయనపై వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆ తర్వాత అధికారులు కూడా.. ఈ అంశంపై నివేదికలు సమర్పించారు. అన్నీ మంచి ఏకగ్రీవాలేనని … బెదిరించినవి.. నామినేషన్లు తిరస్కరించినవి ఏమీ లేవని చెప్పుకొచ్చారు. దీంతో ఎస్ఈసీ ఏకగ్రీవాలను అంగీకరించక తప్పలేదు.
ఈ మధ్యలో ఆయనపై ఎన్నో నిందలు వేశారు. ఇప్పుడు… హైకోర్టు అలాంటి ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టుపై… నిమ్మగడ్డ పై చేసినటువంటి వ్యాఖ్యలు చేయకపోవచ్చు కానీ.. అధికారులు మాత్రం అక్రమాలు జరిగాయని నివేదికలు ఇచ్చే అవకాశం లేదు. నిజాయితీగా నివేదికలు ఇవ్వకుండా నిమ్మగడ్డ అయినా.. హైకోర్టు అయినా ఏమీ చేయలేదు. అధికారులు ఇచ్చిన నివేదికతోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ ఎవరైనా నిజాయితీగా నివేదిక ఇస్తే.. వారిని టీడీపీకి అంటగట్టి శంకరగిరి మాన్యాలు పట్టించడానికి వైసీపీ నేతలు ఒక్క క్షణం కూడా ఆలోచించరు.