కాంగ్రెస్ పార్టీ మార్క్ అంటే ఏంటో.. ఇప్పుడు తెలంగాణ నేతలు మరోసారి చూపిస్తున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…. పీసీసీ చీఫ్ రేసులో బలంగా ఉన్న రేవంత్ రెడ్డి … రైతు సమస్యలపై అచ్చం పేట నుంచి హైదరాబాద్కు పాదయాత్ర ప్రారంభించారు. కార్యకర్తలు వీలైనంతగా కాలు కలుపుతున్నారు. కానీ నేతలు మాత్రం.. పోటీ యాత్రలు ప్రారంభించి.. రేవంత్ పాదయాత్రకు పెద్దగా ప్రచారం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క రైతు భరోసా యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాజెక్టుల యాత్ర చేపడుతున్నారు.
ఆయన తన నియోజకవర్గంలోని ఎస్ఎల్బీసీ నుంచి హైదరాబాద్కు ప్రాజెక్టు యాత్ర చేపడుతున్నారు. పీసీసీ రేసులో మల్లు భట్టివిక్రమార్కతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. అసలు పోటీ కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య ఉందని చెప్పుకున్నారు. ఎవర్ని పీసీసీ చీఫ్ని చేసినా ఇంకొకరు వెళ్లి వేరే పార్టీలో చేరిపోతారన్న అంచనాలు ఉన్నాయి. అయితే క్యాడర్ సపోర్ట్ రేవంత్ కు ఉందన్న అభిప్రాయం ఉంది. ఇలాంటి సమయంలో రేవంత్ రైతు చైతన్య సభలు పెడుతున్నారు. అనూహ్యంగా అచ్చంపేటలో పెట్టి నసభ నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
కాంగ్రెస్లో ఇలాంటి సంస్కృతి లేదు. హైకమాండ్ అనుమతి ఇస్తేనే పాదయాత్ర చేయాలి. కానీ రేవంత్ చొరవ తీసుకున్నారు. అదే చొరవను తాము కూడా తీసుకుంటామని ఇతర పార్టీ నేతలు రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నేతల పోటాపాటీ యాత్రలు.. ప్రజల్లో సమస్యలపై చర్చ జరగడం కాకుండా… కాంగ్రెస్ నేతల వార్ పైనే ప్రచారం జరిగేలా చేస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన మైలేజీ రావడం కంటే… బ్యాడ్ ఇమేజే ఎక్కువ వస్తోంది. పార్టీ కి ఎంత నష్టం జరిగినా నేతలు మాత్రం ఆధిపత్య పోరాటంలో వెనక్కి తగ్గరు.