తెలంగాణ తెలుగుదేశం పార్టీ అచేతనంగా ఉండాలని అనుకోవడం లేదు. ఏదో ఒకటి చేసి ఉనికి కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ .రమణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటూండగా… ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నికలోనూ… రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఆ పార్టీ నాగార్జున సాగర్ ఇన్చార్జ్గా ఉన్న మువ్వా అరుణ్ కుమార్ పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో నాగార్జున సాగర్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. జానారెడ్డి అక్కడ తిరుగులేని నాయకుడిగా విజయాలు సాధిస్తూ వచ్చినా… టీడీపీనే ప్రధాన ప్రత్యర్థి. 2014 ఎన్నికల్లోనూ టీడీపీనే జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చింది.
ఓ సారి తేరా చిన్నపరెడ్డి జానాను ఓడించినంత పని చేశారు. ఆ తర్వాత పరిస్థితులు మారడంతో… టీడీపీ క్యాడర్ మొత్తం మెల్లగా టీఆర్ఎస్ గూటికి చేరింది. అయితే ఇప్పటికీ.. టీడీపీ అభిమానులు గ్రామగ్రామాన ఉన్నారు. కానీ అవి ఓట్ల దాకా వస్తాయా లేదా అన్నదే అనుమానం. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపు నోముల నర్సింహయ్య గెలుపొందారు. జానారెడ్డి ఓడిపోయారు. ఇప్పుడు.. జానారెడ్డి మళ్లీ పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. బీజేపీకి బలమైన అభ్యర్థి లేరు. అక్కడ క్యాడర్ కూడా లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి బీజేపీ టిక్కెట్ ఇచ్చే ఆలోచనలో ఉంది.
ఇప్పటికే ఆకర్ష్ ప్రయోగించి కొంత మందిని చేర్చుకుంది. వారిలో పోటీ చేయగలిగే సామర్థ్యం ఉన్న వారెవరో బీజేపీకి స్పష్టత లేదు. ఇక టీఆర్ఎస్ ఈ సారి… నోముల కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వాలని అనుకోవడం లేదు. బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. అయితే తమ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలంటూ నోముల వారసులు… టీఆర్ఎస్ అగ్రనేతల్ని కలుస్తున్నారు. అయితే దుబ్బాకలో చేసిన తప్పిదాన్ని మళ్లీ చేయకూడదని… కేసీఆర్ భావిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి ప్రకటనతో ఎవరికి నష్టమో.. ఎవరికీ లాభమో అంచనా వేయడం కష్టం కానీ.. టీడీపీ మాత్రం… నెవర్ గివ్ అప్ అన్నట్లుగా పోటీ పడటానికి ప్రయత్నాలు చేస్తోంది.