జమ్మూ – కశ్మీర్‌ను రెండుగా విడదీసి.. యూటీలుగా చేయడంపై పార్లమెంట్‌లో జరిగిన చర్చలో.. అసదుద్దీన్ ఓవైసీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రాల సార్వభౌమాధికారాల్ని లాగేసుకునేందుకు భిన్నమైన వ్యూహంలో వెళ్తుందని చెప్పేందుకు … యూటీ పదాన్ని వాడుకున్నారు. ఒక్క కశ్మీర్ విషయంలోనే కాదు.. కేంద్రం త్వరలో హైదారబాద్, చెన్నై, బెంగుళూరు, కోల్ కతా వంటి పెద్ద నగరాలన్నింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తుందని వ్యాఖ్యానించారు.దీనిపై పార్లమెంట్ లో కేంద్రమంత్రులెవరూ అధికారికంగా స్పందించలేదు. కానీ.. హైదరాబాద్‌కు వచ్చి కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిలాంటి నేతలు మాత్రం… ఓవైసీపై విరుచుకుపడుతున్నారు.
ఓవైసీ… గాలి కబుర్లు చెబుతున్నారని కేంద్రానికి అలాంటి ఉద్దేశమే కాదని.. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదం ఏదో బాగుందని అనుకున్నారేమో కానీ.. కొంత మంది సోషల్ మీడియీలో దీనిపై చర్చ పెట్టారు. బీజేపీకి… హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఉద్దేశం ఉందని.. అందుకే.. పార్లమెంట్‌లో సైలెంట్ గా ఉన్నారని వాదన తీసుకొచ్చారు. నిజానికి.. హైదరాబాద్ యూటీ అనే మాట ఇదే మొదటి సారి కాదు. రాష్ట్ర విభజన తర్వాత చాలా సార్లు వచ్చింది. కొన్ని సార్లు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తారని అలా చేస్తే యూటీ చేయడం ఖాయమని చెప్పుకున్నారు.
నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా.. కేంద్రం దృష్టిలో అలాంటి ఆలోచనలు లేకపోతే.. బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే ఇప్పటికైతే… కేంద్రం అలాంటి ఆలోచనలు చేయకపోవచ్చు. మరోసారి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తే… దేశాన్ని తాను అనుకున్నట్లుగా మార్చడంలో బీజేపీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు. అప్పుడు హైదరాబాద్ యూటీ అవుతుందా లేకపోతే.. రెండో రాజధాని అవుతుందా అన్నది అంచనా వేయడం కష్టం.