స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకుందని అధికారికంగా బయటకు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ మొత్తం గగ్గోలు రేగింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల్లోనే కాదు విశాఖ ప్రజల్లోనూ చర్చనీయాంశమయింది. విశాఖలో అన్ని పార్టీలు నిరసనలు ప్రారంభించాయి. చివరికి వైసీపీ నేతలు కూడా… అవసరం అయితే రాజీనామాలు చేస్తామంటూ ప్రకటనలు చేశారు. అయితే గంటా శ్రీనివాసరావు ఏకంగా రాజీనామా ఇచ్చేసి… స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్త ఆసక్తి రేపేలా చేశారు. ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కు అనే నినాదం ద్వారా.. మొత్తం ఏపీ ప్రజల సెంటిమెంట్ గా మారుస్తున్నారు. తన రాజీనామా ఫార్మాట్లో లేదని వచ్చిన విమర్శలను తిప్పికొట్టేందుకు.. గంటా స్పీకర్ ఫార్మాట్లో తెలుగు, ఇంగ్లిష్‌లలో కూడా లేఖలు పంపారు.
అదే సమయంలో తాను ప్రజాప్రతినిధిగా ఉండనని ఉద్యమంలోనే ఉంటానని స్పష్టం చేస్తున్నారు. తన రాజీనామా ద్వారా వచ్చే ఉపఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. గంటాకు తోడుగా ఇప్పుడు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా స్వరం ప్రారంభిచారు. స్టీల్ ప్లాంట్ పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఆపడానికి తీవ్రమైన ఒత్తిడి తేవాల్సి ఉందని.. అందుకే ఏపీలోని 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని విశాఖకే చెందిన మరో ఎమ్మెల్యే గణబాబు పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడాల్సి వచ్చింది.
విశాఖ ప్రజాప్రతినిధులే రాజీనామా గురించి.. తడబడుతున్నారు. అవసరమైతే రాజీనామా చేస్తామని అంటున్నారు కానీ.. రాజీనామాల ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగబోదని అంటున్నారు. కానీ రాజీనామాల ట్రాప్ ఏంటో వారికి సులువుగానే అర్థవుతుంది. వారు రాజీనామా చేస్తే స్పీకర్ తప్పనిసరిగా అనుమతించాల్సి ఉంటుంది. ఎందుకంటే.. ఒకే పార్టీ కాబట్టి… ఆమోదించకపోతే.. డ్రామా ఆడుతున్నారన్న విమర్శలు వస్తాయి. అదే సమయంలో ప్రజల్లో సెంటిమెంట్ పెరుగుతుంది. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర నిర్ణయాన్ని ఒకటీ… అలా లేఖల ద్వారా తప్ప.. నేరుగా వ్యతిరేకించే పరిస్థితి లేదని వైసీపీని గంటా.. తన రాజీనామాతో చిక్కుల్లో పడేశారని అనుకోవాలి. రాజీనామాలు చేయడానికి టీడీపీ నేతలు సిద్ధమే. ఎందుకంటే ఇప్పుడు…. ఇప్పటి కన్నా టీడీపీ ప్రత్యేకంగా పోగొట్టుకునేది ఏదీ ఉండదు..!