పింక్ డైమండ్ పేరుతో శ్రీవారి ఆలయాన్ని సైతం రాజకీయ వివాదాల్లోకి లాగిన మాజీ ప్రధాన అర్చకుడు … ప్రస్తుత గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు… ఆయన చేసిన ఆరోపణలకు మరింత మసాలా జోడించి… ఇష్టం వచ్చినట్లుగా శ్రీవారి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసిన విజయసాయిరెడ్డికి ఊరట లభించడం లేదు. వారిపై టీటీడీ దాఖలు చేసిన రూ. రెండు వందల కోట్ల పరువు నష్టం కేసును ఉపసంహరించుకోవడానికి తిరుపతి కోర్టు అంగీకరించలేదు. ఇతరులు తాము పార్టీలుగా ఉంటామని.. పిటిషన్లు వేయడంతో కోర్టు అంగీకరించింది. తెలంగాణ హిందూ సంస్థ ఒకటి.. మరో న్యాయవాది వేర్వేరుగా పిటిషన్లు వేశారు. టీటీడీ ఆ పరువు నష్టం కేసుల్ని ఉపసంహరించుకుంటామని పిటిషన్లు ఉపసంహరించుకున్నా.. తాము పార్టీలుగా కొనసాగుతామని వారు పిటిషన్లు వేశారు. వారికి న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వంపై నిందలు వేయడానికి రమణదీక్షితులు, విజయసాయిరెడ్డి పింక్ డైమండ్ ను ఉపయోగించుకున్నారు. టీటీడీపై నిందలు వేయడం.. శ్రీవారి ప్రతిష్టను దిగజార్చడంతో టీటీడీ రూ. రెండుకోట్ల ఫీజు కట్టి మరీ రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై చెరో వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేసింది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక టీటీడీ కూడా వారి చేతులలోకి వెళ్లింది. సహజంగానే టీటీడీ ఆ కేసును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. అప్పుడే వివాదాలు వచ్చాయి. కోర్టు ఫీజు కింద కట్టి రూ. రెండుకోట్లను ఎవరు చెల్లిస్తారో చెప్పాలని భక్తులు ప్రశ్నించారు. అప్పట్లో టీటీడీ వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం జరిగింది. అయితే రెండు కోట్లను ఎలా వెనక్కి తెప్పించుకోలా అర్థం కాలేదు.
దాంతో.. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఇటీవల హైకోర్టు పింక్ డైమండ్ అనేదే లేదని స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ కారణంగా అందరి దృష్టి పరువు నష్టం కేసుపై పడింది. కేసు నడిస్తే.. మెరిట్స్ ప్రకారం… రమణదీక్షితులు, విజయసాయిరెడ్డి ఇద్దరూ ఇబ్బందులు పడటం ఖాయమని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. దీంతో కేసును ఎలాగోలా ఉపసంహరించుకోవాలనే పట్టుదలతో వారిద్దరూ ఉన్నారు. కానీ ఇప్పుడు కేసు పరిధి టీటీడీని దాటిపోయినట్లుగా కనిపిస్తోంది. వారిద్దరూ చిక్కులుఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది.