ఆంధ్రప్రదేశ్లోఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనూ కోడ్ అమల్లోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్లీ ప్రారంభించారు. గతంలో ఎక్కడ ఆగిపోయిందో.. అక్కడి నుంచే ప్రక్రియ ప్రారంభించేలా షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. గతంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఉపసంహరణ.. ప్రచారం… ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఉపసంహరణ దగ్గర్నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించనున్నారు. మార్చి మూడో తేదీన మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత ప్రచారానికి వారం రోజులు గడువు ఉంటుంది.
పదో తేదీన పోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్ అవసరం అయితే పదమూడో తేదీన నిర్వహిస్తారు. 14వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు. మొత్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపల్, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల నిర్వహణను తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు తన విధానాన్ని మార్చుకుంది. ఎన్నికలకు సిద్దమేనని ఎస్ఈసీకి లిఖితపూర్వకంగా తెలిపింది. అయితే ఎస్ఈసీ పరిషత్ ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకోలేదు. పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరగడం… నిబంధనలు ఉల్లంఘించినట్లుగా స్వయంగా ఎస్ఈసీనే కేంద్రానికి లేఖ రాయడంతో అక్కడ్నుంచే ఎన్నికల ప్రక్రియ కొనసాగించడం క్లిష్టతరంగా మారింది.
మున్సిపల్ ఎన్నికల విషయంలోనూ అభ్యంతరాలు ఉన్నాయి. కడప, మాచర్ల వంటిచోట్ల ప్రత్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు. ఈ కారణంగా ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసి మళ్లీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని అన్ని పార్టీలు కోరాయి. అయితే… నిమ్మగడ్డ మాత్రం ఎక్కడ ఆపారో.. అక్కడ్నుంచే ప్రారంభించాలని నిర్ణయించారు.