తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా.. పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నా… తమ రాజకీయాలు మాత్రంమానడం లేదు. పార్టీలో అంతర్గతంగా ఎన్నైనా చేసుకోవచ్చు కానీ.. బహిరంగంగా మాత్రం.. పార్టీకి మేలు కల్పించే పనులు చేయాల్సి ఉంది. ఏ పార్టీలో అయినాఇదే చేస్తారు.కానీ.. కాంగ్రెస్‌లో మాత్రం భిన్నం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమై పోయినా పర్వాలేదు.. చివరికి తమ రాజకీయ భవిష్యత్ కూడా ఇబ్బందుల్లో పడినా పర్వాలేదు.. తమకు నచ్చని నేత మాత్రం… ఎలాంటి ముందడుగు వేయకూడదన్నట్లుగా ఆ పార్టీ నేతల తీరు ఉంటుంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి విషయంలో అదే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రైతు భరోసాయాత్ర చేశారు. సోమవారంతో ముగుస్తుంది. హైదరాబాద్ శివారులో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఒక్క కాంగ్రెస్ సీనియర్ నేత కూడా పట్టించుకోవడం లేదు.
కాంగ్రెస్‌కు ఎంతో కొంత లాభం చేకూర్చే ఇలాంటి పోరాటాలను ప్రోత్సహించాల్సిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి… తన అనుమతి తీసుకోలేదంటూ అలిగారు. దాంతో రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా ఒక్క ప్రకటన చేయలేదు. తన వర్గంగా చెప్పుకునే నేతలెవర్నీ అటు వైపు పోనియలేదు. చివరికి..ముగింపు సభకు కూడా ఉత్తమ్ వెళ్లడం లేదు. ఉత్తమ్ వెళ్లకపోవడం మాత్రమే కాదు.. సీనియర్ నేతలెవరూ వెళ్లవద్దని సూచిస్తున్నారు. అదే సమయంలో.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్.. మాణిగం ఠాగూర్‌పైనా.. హాజరు కావొద్దని ఒత్తిడి తెస్తున్నారు. ఆయన హాజరైతే.. పాదయాత్రకుహైకమాండ్ మద్దతు ఉందన్న ప్రచారం జరుగుతుందని… అంతిమంగా అది రేవంత్ రెడ్డికి మరింత అడ్వాంటేజ్ అవుతుందని నమ్ముతున్నారు.
రేవంత్ రెడ్డికి పార్టీలో ఓ బలమైన వర్గం తయారైంది. అయితే ఆవర్గంలో నేతలు తక్కువ. ద్వితీయ శ్రేణి నేతల్లో డెభ్బై శాతం మంది వరకూ రేవంత్ రెడ్డి అయితేనే పార్టీని ఓ గాడిన పెడతారని గట్టిగా నమ్ముతున్నారు. కానీ పార్టీలో ఎదిగిపోవాలనుకుంటున్న కొంత మంది నేతలు… ఇతరుల్ని కిందకుతోసేసి.. తామున్న స్థానమే పెద్దదని చెప్పుకోవాలని తాపత్రయ పడుతూండటంతో సమస్య వస్తోంది. దీనిపై ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నిర్వీర్యం అయిపోయినా… కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు అంతం ఉండదని.. సెటైర్లు వేస్తున్నారు. బీజేపీకి… కాంగ్రెస్ పార్టీ నేతల తీరే ప్లస్ పాయింట్‌గా మారుతోంది.