శంకర్ సినిమా అంటే ఓ పట్టాన తెవలదు. పంచ వర్ష ప్రణాళికలా సాగుతూనే ఉంటుంది. దాంతో బడ్జెట్లు పెరుగుతాయి. అనేక రకాలైన సమస్యలు వస్తుంటాయి. అవుట్ పుట్ కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుంది కాబట్టి.. శంకర్‌ని భరిస్తుంటారు నిర్మాతలు. శంకర్‌తో సినిమా చేస్తూ.. ఇబ్బందులు పడిన నిర్మాతలెంతో మంది. లైకా లాంటి భారీ సంస్థలే… శంకర్ తో సినిమా చేయలేక మధ్యలోనే చేతులెత్తేశాయి. `రోబో 2`, `ఇండియన్ 2` సినిమాల సందర్భంగా… శంకర్ కీ, నిర్మాతలకూ.. ఎన్నో విబేధాలు వచ్చాయి. వస్తూనేఉన్నాయి. బడ్జెట్ పెరిగిపోవడం వల్లే… `ఇండియన్ 2` సినిమాని పక్కన పెట్టారు. శంకర్ కి నిర్మాతలు పలు షరతులు విధించారు. `ఇంతలోనే తీయాలి` అంటూ గీతలు గీశారు. అయినా షరా మామూలే. శంకర్ ని భరించలేక.. `ఇండియన్ 2` ప్రాజెక్టు కూడా ఇప్పుడు పక్కన పెట్టేశారు. దానికి సంబంధించిన అప్డేట్ ఇప్పటి వరకూ లేదు.
అలాంటి శంకర్ తో దిల్ రాజు ఓ ప్రాజెక్టు చేయబోతున్నాడు. రామ్ చరణ్ హీరో. `ఇండియన్ 2` ప్రాజెక్ట్.. దిల్ రాజునే చేయాలి. అప్పట్లో శంకర్ కి అడ్వాన్సు ఇచ్చాడు. చివరి క్షణాల్లో ప్రాజెక్టు చేతులు మారింది. ఆ ఆడ్వాన్స్ తోనే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడు. దిల్ రాజు స్టైల్ వేరు. శంకర్ వైఖరి వేరు. దిల్ రాజు ప్రాజెక్టులన్నీ పక్కా ప్లానింగ్ ప్రకారం జరగాలి. శంకర్ అలా కాదు. ఓరకంగా సినిమా మేకింగ్ లో ఇద్దరివీ భిన్న ధృవాలు. మరి దిల్ రాజు శంకర్ ని ఎలా కంట్రోల్ చేస్తాడా? అన్నది ఆసక్తిగా మారింది. గత అనుభవాల నేపథ్యంలో.. శంకర్ ని ఎలా డీల్ చేయాలో… దిల్ రాజుకి అర్థమై ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం ఓ ప్యాకేజీలా మార్చి.. `ఇంతలోనే సినిమా పూర్తి చేయాలి` అనే నిబంధనతోనే దిల్ రాజు రంగంలోకి దిగి ఉంటాడు. `ఇండియన్ 2`, `రోబో 2` పాఠాలతో శంకర్ కూడా కాస్త మారాడు. నిర్మాత కోణంలోంచి ఆలోచించి, బడ్జెట్ పరిధులు దాటకుండా, అనవసరమైన హంగులకు ఎక్కువ సమయం వెచ్చించకుండా తీయగలిగితే.. ఈ ప్రాజెక్టు ఎలాంటి గండం లేకుండా.. బయటకు వస్తుంది. మరి ఎవరు
ఎవరి దారిలో వెళ్తారన్నది కాలమే చెప్పాలి.