తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు చురుకుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ అంశాన్ని టీఆర్ఎస్ సెంటిమెంట్ పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇక్కడ కూడా చంద్రబాబును ఇన్వాల్వ్ చేయడానికి స్కెచ్ రెడీ చేసుకున్నారు. చంద్రబాబు పేరు చెప్పి ఎన్నికల్లో గెలవడం టీఆర్ఎస్ నేతలకు ఇప్పటికే బాగా అలవాటయిపోయింది. జగన్, షర్మిల పేరు చెబితే.. సెంటిమెంట్ అంతగా వర్కవుట్ అవదని అనుకుంటున్నారేమో కానీ… ఇప్పుడు కొత్త వాదన తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం షర్మిలను ప్రత్యేక పార్టీగా టీఆర్ఎస్ మంత్రులు పరిగణించడం లేదు. జగనన్న బాణంగానే భావిస్తున్నారు. మంత్రి కమలాకర్.. షర్మిల వస్తోంది.. తర్వాత జగన్ వస్తాడని.. జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని ప్రకటించారు.
తెలంగాణలో మళ్లీ గొడవలు తప్పవని.. ఆంధ్రా నేతలు కరెంట్, నీళ్లు ఎత్తుకుపోతారని బ్లాక్ మెయిలింగ్ కూడా ప్రారంభించారు. చివరిగా కేసీఆర్ను కాపాడుకోకుంటే సమైఖ్య రాష్ట్రం అవుతుందని హెచ్చరికలు కూడా కమలాకర్ జారీ చేశారు. షర్మిల పార్టీ విషయంలో ఎలా వ్యవహరించాలో.. టీఆర్ఎస్ ఓ స్టాండ్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. షర్మిల పార్టీ కోసం సమావేశం అయిన రోజున… ఘాటుగా ఎదురుదాడి చేసినా.. తర్వాత స్పందించవద్దని ప్రగతి భవన్ నుంచి ఆదేశాలు రావడంతో సైలెంటయ్యారు. ఇప్పుడు మేథోమథనం జరిపి.. తెలంగాణ సెంటిమెంట్ ను రేపడానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందీ. ఈ మేరకు మంత్రి గంగుల కమలాకర్.. ఓపెనింగ్ చేసినట్లుగా భావిస్తున్నారు.
మరో వైపు షర్మిల లోటస్ పాండ్లో రోజువారీ సమావేేశాలతో బిజీగా ఉంటున్నారు. టీఆర్ఎస్ తన .. పార్టీని బూచిగా చూపి.. సెంటిమెంట్ రేపే ప్రయత్నాల్లో ఉండటంతో ఆమె దీటైన వాదన సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తాను తెలంగాణ కోడలినని.. తనకు హక్కు ఉందంని షర్మిలా వాదించనుందని.. పుట్టిన ఇల్లు ఆంధ్ర.. మెట్టినిల్లు తెలంగాణగా షర్మిల ప్రచారం చేసే ఛాన్స్ ఉందని.. లోటస్ పాండ్లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి టీఆర్ఎస్కు సెంటిమెంట్ అడ్వాంటేజ్ ను షర్మిల పార్టీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.