పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని… ఇతర పార్టీల మద్దతుదారులు గెలిచినప్పటికీ.. వైసీపీ మద్దతుదారులు గెలిచినట్లుగా అధికారులు ప్రకటిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కావాలంటే నాలుగైదు సార్లు కౌంటింగ్ జరిపి.. ప్రత్యర్థిపార్టీ మద్దతుదారులకు వచ్చిన ఆధిక్యాన్ని తగ్గించేసి.. వైసీపీ మద్దతుదారులకు మెజార్టీ ఇస్తున్నారని.. కొన్ని ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఈ అంశంపై… కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఓట్ల లెక్కింపును వీడియో రికార్డింగ్ చేయాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 13, 15 తేదీల్లో ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సిందేననని స్పష్టం చేశారు. కౌంటింగ్‌ను నిష్పక్షపాతంగా జరపాలని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే.. అన్ని పంచాయతీల్లో కాకుండా.. పంచాయతీలో ఉండే ఓటర్ ఎవరైనా ఓట్ల లెక్కిపును వీడియో షూట్ చేయాలని కోరితే.. వెంటనే కౌంటింగ్‌ను చిత్రీకరించాలని హైకోర్టు ఆదేశించింది. టెక్నాలజీ సాకులు చెప్పొద్దని రూలింగ్‌లో హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఎన్నికలు జరిగిన ప్రతీ గ్రామంలోనూ.. ఓట్ల లెక్కింపు రికార్డింగ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు విడతల ఎన్నికల సమయంలో చంద్రబాబు… పలుమార్లు తమ పార్టీ మద్దతుదారులు ఎన్నికల్లో గెలిచినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా ప్రకటన చేయకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపణలు చేశారు.
నిజానికి చాలా పంచాయతీల్లో… ఓట్ల లెక్కింపును వీడియో షూటింగ్ చేయడం లేదు. కొన్ని చోట్ల చేస్తున్నారు. భద్రతాపరంగా క్లిష్టమైన ప్రాంతాల్లో మాత్రమే ఇప్పటి వరకూ వీడియో షూటింగ్ చేస్తున్నారు. మిగిలిన రెండు విడతల్లో దాదాపు అన్ని పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ వీడియో షూటింగ్ ఖాయమని చెప్పుకోవచ్చు. దీంతో టీడీీ నేతల్లో కాస్తంత ధైర్యం పెరిగింది. అయితే అంతా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.