మున్సిపల్ ఎన్నికలను ఎక్కడ ఆగిపోయాయో.. అక్కడ్నుంచే కొనసాగించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయించడం వివాదాస్పదమవుతోది. ఏకగ్రీవాల్లో అక్రమాలు జరిగాయని ఆయనే కేంద్రానికి లేఖ రాసి.. ఇప్పుడు.. వాటిని కొనసాగించడం ఏమిటన్నది ఇతర పార్టీల విమర్శలు. వీటికి చెక్ పెట్టేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బెదిరింపుల కారణంగా.. నామినేషన్ వేయనివారికి తిరిగి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. గుంటూరులోని మాచర్ల, కడపలోని పులివెందుల, రాయచోటి,.. చిత్తూరులోని పుంగనూరు, పలమనేరు, తిరుపతి నగర పాలక సంస్థలో.. సింగిల్ నామినేషన్లపై ఎస్ఈసీ అధికారులను నివేదిక కోరింది.
ఇరవయ్యో తేదీలోపు పూర్తిస్థాయి నివేదిక అందించాలని స్పష్టం చేసింది. బెదిరించారని కానీ.. బెదిరిస్తున్నారని కానీ రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసి ఉంటే.. ఆ వార్డుల్లో మళ్లీ నామినేషన్లు తీసుకోవాలని ఎస్ఈసీ రిటర్నింగ్ అధికారులకు స్పష్టం చేసింది. బెదిరింపులపై మీడియాలో వచ్చిన వార్తలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఎస్ఈసీ నిర్ణయించారు. బెదిరింపులకు భయపడి నామినేషన్లు వేయని వారు.. ఉపసంహరించుకున్న వారు ఎవరైనా ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయడానికి ముందు ఎన్నికల ప్రక్రియ దారుణంగా జరిగింది.
దాడులు.. దౌర్జన్యాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. అయితే ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. దాంతో ఆ ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి.. మళ్లీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తారని భావించారు. కానీ నిమ్మగడ్డ వారి అంచనాలను తలకిందులు చేశారు. అయితే…నామినేషన్లు వేయలేకపోయిన చోట.. కొత్తగా అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు.