తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పోరు పతాక స్థాయికి చేరింది. రేవంత్ రెడ్డి రైతు రణభేరీ సభను భారీగా నిర్వహించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ సహా… తాము పీసీసీ రేసులో ఉన్నామని చెప్పుకుంటున్న వారెవరూ.. ఈ సభకు హాజరు కాలేదు. కానీ క్యాడర్ ను మాత్రం పెద్ద ఎత్తున సమీకరించారు. భారీ హంగామా చేశారు. సభలో రేవంత్ కూడా అంతే దూకుడుగా వ్యవహరించారు. రైతు ఎజెండాతో పాటు.. పార్టీలోని తన వ్యతిరేకుల్ని.. తన పాదయాత్రను వ్యతిరేకించిన వారిని టార్గెట్ చేశారు. రేవంత్ నేరుగా ఎవర్నీ విమర్శించలేదు కానీ.. ఇతర నేతలందరూ … కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని బతికించే వారు కావాలని..అది రేవంత్ రెడ్డికే సాధ్యమవుతుందన్నారు.
ఈ సభలో రేవంత్ అనుకూలురు ఆయనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ కట్ట బెట్టేందుకు ప్రయత్నించారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తే ఇలానే చాలా మంది సీనియర్లు అడ్డుకున్నారని ఇప్పుడు కూడా అలాంటి వారు ఉన్నారని మండిపడ్డారు. అదే సమయంలో వైఎస్‌కు అత్యంత సన్నిహితుడయిన.. సూరీడు కూడా రావిరాల సభా వేదిక మీద కనిపించారు. ఇతర నేతలంతా రేవంత్‌కు వైఎస్ తరహా ఇమేజ్ కట్టబెట్టే ప్రయత్నం చేయడం… సూరీడు కూడా వేదిక మీద కనిపించడం ఆసక్తి రేపింది.
రేవంత్ సభ మొత్తం కాంగ్రెస్‌లో రేవంత్ అనుకూల, వ్యతిరేక వర్గాలను వేరు చేసింది. రేవంత్‌కు అనుకూలంగా ఉన్న వారిలో పొన్నం, కుసుమ కుమార్, కొండా సురేఖ, మల్లు రవి, సీతక్క, మల్రెడ్డి రంగారెడ్డి, దాసోజు శ్రవణ్, సురేష్ షెట్కర్ వంటి వారు ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిగం ఠాగూర్ వస్తారని అనుకున్నా… ఆయన సీనియర్ల ఒత్తిడికి తలొగ్గారు. హాజరు కాలేదు. రేవంత్ ను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న ఉత్తమ్, భట్టి, జగ్గారెడ్డి, పొన్నాల, వీహెచ్ వంటి వారు హాజరు కాలేదు. అయితే రేవంత్ తన బలప్రదర్శన చేశారు. అదే సమయంలో… తన కార్యాచరణను కూడా ప్రకటించారు.
తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని రేవంత్ ప్రకటించారు. అదే సమయంలో.. హైకమాండ్‌ను ధిక్కరించినట్లుగా కాకుండా… వారి పర్మిషన్ తీసుకుంటానని కూడా ప్రకటించారు. పాదయాత్ర చేసి కేసీఆర్‌ను కప్పేస్తానని ధీమాను కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి పాదయాత్ర చేసి.. భారీ బహిరంగసభ నిర్వహించి రేవంత్…తన బలాన్ని..బలగాన్ని పార్టీ హైకమాండ్‌కు చూపించారు. ఇప్పుడు.. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఆయన ఫ్రంట్ రన్నర్‌గానే ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ రాజకీయాలు మాత్రం భిన్నం.. హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నదే ఆసక్తికరం.