విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని.. కేంద్రం నిర్ణయానని అడ్డుకోవాలని తనను కలిసేందుకు వచ్చిన విశాఖ ఉక్కు పోరాట సమితీ నేతలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తామని వారికి జగన్ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఉక్కు పోరాట సమితి నేతలే చెప్పారు. వైసీపీ నుంచి కానీ.. సీఎంవో నుంచి కానీ.. ఉక్కు పోరాట సమితితో చర్చలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. విశాఖ శారదా పీఠంలో ప్రత్యేక పూజల కోసం ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి విశాఖకు వచ్చారు. అయితే ఆయన రాక సందర్భంగా అలజడి రేపుతారన్న ఉద్దేశంతో పలువురు విపక్ష నేతలతో పాటు… కార్మిక సంఘ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు.
విశాఖ ఉక్కు పోరాట సమితిగా చెప్పుకున్న కొంత మంది నేతలను మాత్రం పోలీసులు ఎయిర్ పోర్టులోకి తీసుకెళ్లారు. అక్కడ జరిగిన చర్చల సారాంశం ఏమిటో కానీ.. జగన్ భరోసా సంతృప్తి నిచ్చిందని ఆ ఉక్కు పోరాట సమితీ నేతలు ప్రకటించుకున్నారు. అయితే అందర్నీ అరెస్ట్ చేసి.. తమ పార్టీ సానుభూతి పరులను కమిటీ పేరుతో పిలిపించి మాట్లాడారని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ ఐదు నిమిషాలు మాత్రం.. కార్మిక నేతలతో మాట్లాడారు. కానీ శారదాపీఠంలో మాత్రం ప్రత్యేకంగా పూజుల చేశారు. పీఠంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవ మూర్తి ఆలయం, దాసాంజనేయస్వామి ఆలయాలను సందర్శించి ..రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. సాధారణంగా ఇలాంటి యాగాలు దంపతులు చేస్తారు. కానీ జగన్ మాత్రం ఒంటరిగానే చేశారు. తర్వాత శారదాపీఠం వెబ్ సైట్‌ను ఆవిష్కరించి.. పండితులకు సత్కారం చేసి.. తాడేపల్లి బయలుదేరారు. జగన్ యాగం చేస్తున్న దృశ్యాలను ప్రత్యేకంగా మీడియాకు విడుదల చేశారు.
ఇటీవలి కాలంలో ఆయనపై క్రిస్టియన్ సీఎం అనే ప్రచారం జరుగుతూండటంతో కౌంటర్‌గా మాటలతో కాకుండా.. చేతలతో పూజలు చేస్తున్నట్లుగా… వైసీపీ కౌంటర్ ప్రచారం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఎవరేమనుకున్నా.. సీఎం జనగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రేగుతున్న ఉద్యమం కన్నా.. శారదా పీటంలో రాజశ్యామల యాగం చేయడానికే అత్యంత ప్రాముఖ్యత నిచ్చారు. అక్కడిదాకా వెళ్లి అసలు పట్టించుకోలేదన్న విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో పార్టీ సానుభూతి పరులతో ఓ కమిటీని పంపి మాట్లాడించారని విపక్ష నేతలు మండి పడుతున్నారు.