తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై షర్మిల చాలా వేగంగా కసరత్తు పూర్తి చేస్తున్నారు. పార్టీ ప్రకటన తర్వాత రాజకీయ పోరాటం తప్ప… పార్టీ పరమైన పనులేమీ పెండింగ్ ఉండకుండా… జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా… తన పార్టీకి.. ఇద్దరు సలహాదారుల్ని నియమించారు. రిటైరైన సివిల్ సర్వీస్ అధికారులు.. అదీ కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సీఎంవోలో అత్యంత కీలకంగా వ్యవహరించిన అధికారులకు మొదటి సారిగా రెండు సలహాదారుల పదవులు ఇచ్చారు. అందులో ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి కాగా.. మరొకరు ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ సిన్హా. సిన్హా.. అప్పటి సీఎం వైఎస్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు.
షర్మిల రాజకీయ పార్టీ కోసం వేస్తున్న అడుగులను బట్టి చూస్తే.. పూర్తిగా అన్న జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో తన తండ్రికి నమ్మకంగా పని చేసిన వారినే ఎక్కువగా నమ్ముతున్నారు. ఇలా.. షర్మిల పార్టీలో కీలక వ్యక్తులు చేరడానికి తెర వెనుక ఓ కీలక వ్యక్తి ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. వైఎస్ హయాంలో ాయన కూడా చక్రం తిప్పారు. షర్మిల ఇంటి వద్దకూ ప్రతీ రోజూ.. కొన్ని ఎంపిక చేసిన వర్గాల నేతలు వచ్చేలా షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. షర్మిల ప్రతి రోజూ.. పార్టీ ఆఫీసుకు వచ్చే సరికి కనీసం యాభై, అరవై మందికి తగ్గకుండా… వివిధ జిల్లాల నుంచి విభిన్నవర్గాలకు చెందిన ఓ మాదిరి చోటా నేతలు లోటస్ పాండ్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. వారికి భరోసా ఇస్తూ.. షర్మిల పార్టీ ఆఫీసులోకి వెళ్తున్నారు.
పార్టీకి చాలా క్రేజ్ ఉందని చెప్పేందుకు రాజకీయాలతో సంబంధం లేని విభిన్న రంగాల్లో ప్రముఖులయిన వారిని షర్మిలతో భేటీకి ఆహ్వానిస్తున్నారు. నల్లగొండకు చెందిన మోటివేషనల్ స్పీకర్ షఫీ కూడా షర్మిలను కలిశారు. ఆయన కూడా రాజకీయ ఆకాంక్షలు వ్యక్తం చేశారు. ఇలా… ప్రముఖులుగా మారి.. రాజకీయ ఆకాంక్షలు ఉన్న వారిని షర్మిల పార్టీ ప్రతినిధులు సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.