విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి .,.కార్మిక సంఘ ప్రతినిధులతో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. పోస్కో సంస్థ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేస్తుందనేది అవాస్తవమని ఆయనతేల్చేశారు. వారు తనను కలిసింది వాస్తవమే కానీ… విశాఖ ప్లాంట్ గురించి ప్రస్తావన రాలేదని తేల్చేశారు. కడపలో ప్లాంట్ పెట్టమన్నానని.. అక్కడ కాకపోతే మరో చోట పెట్టాలనిచెప్పానని.. ఆ దిశగా వారు పరిశీలన జరుపుతున్నారని జగన్ ప్రకటించారు. కానీ పోస్కో విశాఖకు రాదని తేల్చేశారు. దేవుని ఆశీస్సులతో స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం ఆలోచనలో మార్పు వస్తుందని భావిస్తున్నానని కేంద్రం నిర్ణయంలో మార్పులేకపోతే.. స్టీల్‌ప్లాంట్‌కు అనుకూలంగా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేస్తామని జగన్ కార్మిక సంఘ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
కార్మిక సంఘాలతో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూముల్లో.. గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీ పెట్టడానికి పోస్కోతో ఒప్పందం జరిగిందని ఇలా ఒప్పందం జరిగిన తర్వాతే పోస్కో బృందం సీఎం జగన్ ను కలిసిందని.. అలాగే స్టీల్ ప్లాంట్‌ను కూడా మూడు సార్లు సందర్శించిందని… పార్లమెంట్లో .. కేంద్ర ఉక్కు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకే ఈ సమాధానం ఇచ్చారు. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… పార్లమెంట్లో కేంద్రమంత్రి చెప్పిన అంశాన్ని ఖండిస్తున్నారు. నిజానికి స్టీల్ ప్లాంట్ భూముల్లో ఎనిమిది వందల ఎకరాలు ఇవ్వడానికి కేంద్రంతో పోస్కోతో ఒప్పందం చేసుకున్న తర్వాతనే సీఎం జగన్ ను కలిసి ఆ అంశంపై మాట్లాడారు. అప్పట్లో ఈ విషయం ప్రముఖంగా మీడియాలో కూడా వచ్చింది. కానీ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఖండన ప్రకటనలు రాలేదు.
ఇప్పుడు మాత్రం… ఇతర చోట్ల పోస్కో ప్లాంట్ పెట్టడానికి ఏపీకి వచ్చిందని చెబుతున్నారు. నిజానికి పోస్కో నుంచి అలాంటి ప్రతిపాదనలు ఉన్నట్లయితే.. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ఉండేదని కొంత మంది విశ్లేషిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో ఏపీ సర్కార్‌కు ఎలాంటి హక్కులు లేవని చెప్పడం ద్వారా తాము ఏమీ చేయలేమన్న సంకేతాలను సీఎం జగన్ పంపిచారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఏర్పడుతోంది. అయితే ఓ లేఖ.. లేకపోతే తీర్మానం చేస్తారని.. అంతకు మించి ప్రజల సెంటిమెంట్‌ను కాపాడేందుకు రాజీనామాలు చేసి .. కేంద్రంపై పోరాడే యోచన అసలు లేదని జగన్ మాటలతో తేలిపోయిందని చెబుతున్నారు.