రాజకీయ విబేధాలతో హత్యలు చేయడం… తమకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని నరికేయడాలు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి. తెలంగాణలో ఇలాంటివి చాలా తక్కువ. కానీ పెద్దపల్లి జిల్లాలో లాయర్ దంపతులను హత్య చేసిన తీరు చూసిన తర్వా అందరూ తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. హైకోర్టు లాయర్లు అయిన వామనరావు, నాగమణి దంపతుల్ని నడిరోడ్డుపై వేట కత్తులతో నరికి చంపేశారు. ఆ దృశ్యాలను ఎదురుగా ఉన్న వారు వీడియో తీశారు. అవి చూసిన వారికి ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. మనిషి ప్రాణాలను ఇంత తేలికగా తీయవచ్చా అని.. అని అనుకునేలా ఆ పరిస్థితులు ఉన్నాయి.
వామనరావు లాయర్. ఆయన అన్యాయం అని తాను భావించిన వాటిపై పిటిషన్లు వేసి పోరాడుతూంటారు. ఈ క్రమంలో అనేక మంది రాజకీయ నేతలకు ఆయన టార్గెట్ అయ్యారు. చివరికి పోలీసులకు కూడా ఆయన టార్గెట్ అయినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రాణహాని ఉందని… వామనరావు, నాగమణి దంపతులు హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినప్పటికీ.. వారి ప్రాణాలు దక్కలేదు. అత్యంత కర్కశంగా..కిరాతకంగా… నరికి చంపేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు మరింత విస్మయం కలిగిస్తోంది. లాయర్ దంపతులను నడిరోడ్డుపై నరికేసిన తర్వాత .. అక్కడ సాక్ష్యాలను కాపాడే ప్రయత్నం పోలీసులు చేయలేదు. ఉన్నతాధికారులు ఎవరూ సంఘటనా స్థలాన్ని సందర్శించలేదు.
తెలంగాణలో రాజకీయ అసహనం పెరిగిపోతోందన్న అభిప్రాయం ఈ హత్యల ద్వారా ఏర్పడుతోంది. నిజానికి అధికారంలో ఉన్న వారిపైనే ఎక్కువగా అక్రమాల ఆరోపణలు వస్తాయి. అధికారంలో ఉన్నారు కాబట్టి… అవి సహజం. వాటిపై ఆధారాలు ఉంటే… కేసులు పెడతారు.. పిటిషన్లు వేస్తారు. అంత మాత్రానికే నరికి చంపడాలు అనేది.. తెలంగాలో కొత్తగా వచ్చిన సంస్కృతి. వామనరావు, నాగమణి దంపతులు ఇతర పార్టీలతో సన్నిహితంగా ఉండేవారు కాదు.. అధికార అక్రమాలపై మాత్రమే పోరాడేవారు. ఈ క్రమంలో వారిని కూడా నరికి చంపడం… తెలంగాణ సమాజంలో కొత్త భయాలను సృష్టిస్తోంది.
వామనరావు, నాగమణి దంపతుల హత్యలో టీఆర్ఎస్ నేతల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రధాన అనుచరుడు కుంట శ్రీను స్వయంగా హత్యలో పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. పోలీసులు దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ.. హత్యలు జరిగిన తీరు.. దృశ్యాలను చూస్తే.. తెలంగాణలో రాజకీయ అసహనం … ప్రమాదకర స్థితికి వెళ్తోందన్న అభిప్రాయం మాత్రం కలిగిస్తోంది.