చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పంచాయతీల్లో వైసీపీ అత్యధికం గెలుచుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక వ్యూహం అవలంభించి… పుంగనూరు నుంచి తన అనుచరుల్ని కుప్పంలో దింపి.. గ్రామానికో వ్యూహం అమలు చేశారు. టీడీపీ నేతల్నిపార్టీలో చేర్చుకుని.. ఓ ఉద్యమంలా చంద్రబాబు నియోజకవర్గంలో టీడీపీని ఓడించామన్న అభిప్రాయం కల్పించడానికి శాయశక్తులా ప్రయత్నించి… చివరికి అనుకున్నది సాధించారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలుండగా 89 పంచాయతీల్లో ఎన్నికలు జరిగాయి. వీటిల్లో 73 చోట్ల వైసీపీ, 14 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు గెలిచారు.
అధికార దుర్వినియోగం చేసి..పోలీసుల్ని ప్రయోగించి… వైసీపీ నేతలు చెప్పినట్లుగా చేయకపోతే… చర్యలు తీసుకుంటామని పెద్ద వైసీపీ అగ్రనేతలందరూ కుప్పం అధికారులకు నేరుగానే హెచ్చరికలు జారీ చేశారు. కుప్పంతో ఎలాంటి సంబంధం లేని వైవీసుబ్బారెడ్డి లాంటి వారి హెచ్చరికలు కూడా హైలెట్ అయ్యాయి. ప్రభుత్వ పథకాలు అందవని.. ఓటర్లను… టీడీపీకి పని చేస్తే కేసులు తప్పవని టీడీపీ నేతలను వైసీపీ నేతలు బెదిరించారని… టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2013 పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 12 పంచాయతీల్లో గెలిచింది.
కుప్పం ఫలితాలను చూపించి వైసీపీ నేతలు … చంద్రబాబు పని అయిపోయిందని ప్రచారం చేస్తున్నారు. దీనికి పోటీగా టీడీపీ నేతలు… విజయలక్ష్మి ఓటమి… వివేకానందరెడ్డి ఓటమిని చూపిస్తున్నారు. అధికారం ఉంది కదా అని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే.. అధికారం కోల్పోయిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోమని అంటున్నారు. కుప్పంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో… అందరికీ తెలుసని… చంద్రబాబును దెబ్బకొట్టామని అనుకుంటే… అది వైసీపీ నేతల అమాయకత్వమేనని.. మీడియాలో ప్రచారం చేసుకోవడానికే పనికొస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు.