స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీకి వెళ్లి మూడు రోజులు గడిపి.. తిరిగి వచ్చేసిన ఏపీ బీజేపీ నేతలు… కొత్త వాదన వినిపించడం ప్రారంభించారు. అదేమిటంటే… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదట. కేంద్రం నిర్ణయం తీసుకోకుండానే… ఏపీలో అధికారపక్షం.. ప్రతిపక్షం.. బీజేపీపై కుట్ర చేసి మరీ ప్రచారం చేస్తున్నాయట. ఈ విషయాన్ని వంద సార్లు చెప్పాలన్న లక్ష్యంతో జీవీఎల్ నరసింహారావు ఏపీకి వచ్చేశారు. ఆయనతో పాటు సోము వీర్రాజు సహా ఇతర ముఖ్య నేతలంతా కోరస్‌గా అదే మాట వినిపించడం ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోలేదని బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ ను వంద శాతం ప్రైవేటీకరణ చేయాలని… కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం రికార్డెడ్. ఈ ఉపసంహరణ బాధ్యతలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కే ఇచ్చారు. ఇదంతా కేబినెట్ సెక్రటరీ ట్వీట్ చేశారు కూడా. ఆ తర్వాత ఈ విషయం రగడ ప్రారంభమయింది. కేంద్రం కూడా… ఇంత గొడవ జరుగుతున్నా… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోలేదని ఎక్కడా చెప్పడం లేదు. కానీ .. ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. ఏపీకి వచ్చి దబాయిస్తున్నారు. కేంద్రం నిర్ణయం తీసుకోలేదని.. కానీ ప్రజల్ోల ఇతర పార్టీలు అపోహలు కల్పిస్తున్నాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం సెంటిమెంట్‌గా మారిందని.. ప్రక్రియను ఆపడానికి ఏదో ఒకటి చేయాలని ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేశారు. అక్కడ వారికి ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు. కానీ … నిర్ణయం తీసుకోలేదని ఎదురుదాడి చేయాలని చెప్పి పంపేసినట్లుగా ఉన్నారు. అందుకే.. వారు ఏపీకి వచ్చి… ఆ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు.. అనేక రకాలుగా ఏపీ ప్రజల్ని వంచించారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా.. స్టీల్ ప్లాంట్ విషయంలో వారి తీరు ప్రజల్ని మరింత అసహనానికి గురి చేసే అవకాశం కనిపిస్తోంది.